
'రాష్ట్రంలో పోలీస్ రాజ్యం సాగుతోంది'
కరీంనగర్: తెలంగాణలో పోలీస్ రాజ్యం కొనసాగుతోందనీ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జైళ్లలో తొండలు గుడ్లు పెడుతాయని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఉద్యమాలను అనచివేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం రేవంత్.. కరీంనగర్ జైలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో ములాకత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే వారిపై కేసీఆర్ అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు.
సాగు నీళ్లు అడిగిన పాపానికి టీడీపీ నేతలతో పాటు రైతులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టాల్సి వస్తే మంత్రులు ఈటల రాజేందర్, హరీష్రావులపై నమోదు చేయాలన్నారు. కేసీఆర్ పతనానికి కరీంనగర్ నుంచే నాంది పలుకుతామని పిలుపునిచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం త్వరలో ఆందోళన చేపడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు.