ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు అన్నాడీఎంకే ఉరకలు వేస్తోంది. విపక్షాలు సైతం ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీకి దిగరాదని భారతీయ జనతా పార్టీ, డీఎండీకే నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన పార్టీలు పోటీ నుంచితప్పుకున్నట్లయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: గతనెల 23న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జయలలిత ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. తాజా పార్లమెంటు ఎన్నికల తరువాత నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అమ్మపార్టీ సత్తాచూపింది. ఆదాయానికి మించిన కేసులో జయకు జైలుశిక్ష పడిన కారణంగా శ్రీరంగం ప్రాతినిథ్యాన్ని కోల్పోగా ఉప ఎన్నిక జరిగింది. ఆనాటి ఉప ఎన్నికలో అన్ని విపక్ష పార్టీలు పోటీచేసి చతికిలపడ్డాయి. ఈ చేదు అనుభవం నుంచి ప్రతిపక్షాలు బైటపడక ముందే మళ్లీ ఉపఎన్నిక ముంచుకొచ్చింది. జయ అక్రమార్జనే ప్రధాన ప్రచారాస్త్రంగా భావిస్తూ వచ్చిన విపక్షాలకు ఆమె నిర్దోషంటూ కోర్టు ఇచ్చిన తీర్పు గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. ఉప ఎన్నికలో అమ్మపై పోటీకి దిగి అప్రతిష్టపాలయ్యే కంటే మిన్నకుండడం మేలని దాదాపుగా అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి.
అందరికంటే ముందుగా అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పోటీకి దూరమని ప్రకటించేసింది. ఆ తరువాత వరుసగా పీఎంకే, ఎండీఎంకే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్కేనగర్‌లో పోటీకి పెట్టాలని బీజేపీ ఆశించింది. కమలనాథుల కూటమిలో మిగిలిన ఏకైక పెద్దపార్టీ డీఎండీకేతో సంప్రదింపులు జరిపింది. రెండు పార్టీలకు సంబంధించి ఎవరు పోటీకి దిగినా రెండవవారు మద్దతు నిచ్చేలా మాట్లాడుకున్నారు. మరో మూడురోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఈనెల 6వ తేదీన డీఎండీకే అధినేత విజయకాంత్‌తో సమావేశమయ్యారు.
ఈసీ ఏకపక్ష వైఖరి వల్ల దూరం
కూటమి పార్టీ పోటీ వద్దనే నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ సైతం విధిలేని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందునే పోటీ పెట్టడం లేదని విజయకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన శ్రీరంగం, ఏర్కాడు ఉప ఎన్నికల్లో సైతం ఈసీ ఏకపక్షంగా వ్యవహరిం చిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్కేనగర్‌లో సైతం అదే వైఖరిని కొనసాగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఆర్కేనగర్ నియోజకవర్గంలో రోడ్లు వేసి నా, పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చినా ఈసీ నోరుమెదపడం లేద ని ఆయన అన్నారు. పక్షపాతధోరణిలో సాగే ఎన్నికల్లో పోటీచేసేకంటే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి తలపడటమే మేలని బీజేపీ, డీఎండీకే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండురోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నారు.
ఉపసమరానికి దూరం
Published Mon, Jun 8 2015 2:18 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM
Advertisement