కోరికలు తీరగ... రొట్టెల మార్చగ! | rottela panduga nellore 2016 in nellore city | Sakshi
Sakshi News home page

కోరికలు తీరగ... రొట్టెల మార్చగ!

Published Wed, Oct 12 2016 8:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

కోరికలు తీరగ... రొట్టెల మార్చగ! - Sakshi

కోరికలు తీరగ... రొట్టెల మార్చగ!

నెల్లూరు బారాషహీద్ దర్గాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తుల తరలి వస్తారు. బారాషహీద్‌లను దర్శించుకోవడమే కాక కోర్కెలను తీర్చే రొట్టెల కోసం భక్తులు ఏటా లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఈ దర్గాకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.
 
దర్గా ప్రాశస్త్యం
టర్కీకు చెందిన 12 మంది మతబోధకులు మక్కా నుంచి మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో మైసూర్‌ను పాలించే హైదర్‌అలీ సహకారంతో అనేకప్రాంతాల్లో దైవబోధనలు చేశారు. పలు ప్రాంతాల్లో మసీదులు నెలకొల్పారు.
 
ఆ సమయంలో కొడవలూరు మండలం లోని గండవరం గ్రామంలో తమిళనాడు వాల్జా రాజులకు, బీజాపూర్ సుల్తాన్‌లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ పవిత్రయుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్‌బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారు.  
 
వారి తలలు గండవరంలో తెగిపడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరారు. వారి కోరిక మేరకు12 మందికి సమాధులు నిర్మించారు.  
 
 ఆర్కాట్‌నవాబుతో రొట్టెల మార్చుకోవడం ప్రారంభం
 తమిళనాడును అప్పట్లో ఆర్కాట్ నవాబు పరిపాలించే వారు. నెల్లూరు జిల్లా కూడా వారి ఆధీనంలో ఉండేది. ఈ క్రమంలో ఆర్కాట్ నవాబు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండాపోయేది. దీంతో ఆయన తన రాజ్యమంతటా తన భార్య రోగాన్ని నయంచేసిన వారికి బహుమతి ఇస్తారని ప్రకటించారు.
 
ఈ క్రమంలో స్వర్ణాల చెరువులో బట్టలు ఉతికే రజకులు రాత్రి పూట అక్కడే నిద్రపోయేవారు. రాత్రి కలలో బారాషహీద్‌లు కలలో కనపడి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని దర్గాకు వస్తే నయమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని రజకులు రాజుకు తెలియజేశారు. అప్పటికే పుణ్యక్షేత్రాలను దర్శిస్తే రోగం నయమవుతుందన్న పండితుల మాటను విన్నరాజు మరుసటి రోజు తన భార్యతో కలిసి బారాషహీద్ దర్గాలో నిద్రచేశారు.
 
షహీద్‌ల మహత్యం రాజు భార్య రోగం నయమైంది. దీంతో రాజు, రాణి ఇద్దరూ స్వర్ణాల చెరువులో స్నానమాచరించి తమ కోరిక తీరినందుకు తాము తెచ్చుకున్న రొట్టెలను స్థానికులకు పంచారు. దాన్ని ఆరోగ్య రొట్టెగా ప్రజలు తీసుకున్నారు. అప్పటి నుంచి కోరికలను తీర్చుకునేందుకు రొట్టెలను మార్చుకుంటున్నారు.
 
నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి
ఆర్కాట్ నవాబు ప్రారంభించిన ఈ రొట్టెలు మార్చుకునే కార్యక్రమం రొట్టెల పండగగా మారింది. మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వరోజున రొట్టెల పండగ ప్రారంభమవుతోంది. ప్రారంభమైన మరుసటి రోజు గంధమహోత్సవం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌లకు లేపనం చేసి, భక్తులకు పంచిపెడుతారు. అనంతరం తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుని బారా షహీద్‌లు ప్రసాదించిన ప్రసాదంగా భావిస్తారు.  
 
పీర్లను కడిగిన చోటే రొట్టెల మార్పిడి   
మొహరం నెలలో జరిగే పీర్లపండగ చివరి రోజు పీర్లను స్వర్ణాల చెరువులో కడుగుతారు. దీంతో స్వర్ణాల చెరువు పవిత్రమవుతుందని ఇమామ్ అబూబాకర్ అషఫ్రి అంటున్నారు. అందుకే ఆ ప్రాంతంలో కోర్కెల రొట్టెలను మార్చుకుంటారని చెబుతున్నారు. మొహరం పండగ పదో రోజు మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమామ్ హుస్సేన్, ఆయన సహచరులు 72 మంది ఇరాక్‌లోని కర్బలా మైదాన ంలో యజీద్ సైన్యంతో యుద్ధం చేసి వీరమర ణం పొందారం టున్నారు. సంతాపదినం (జియారత్) రోజున రొట్టెలు మార్చుకుంటా ర ని ఆయన చెబుతున్నారు.
 
 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం   
నెల్లూరు సిటీ:  ఈ ఏడాది 10 నుంచి 12 లక్షల మంది భక్తులు రొట్టెల పండగకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా 24గంటల పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.  దర్గా ప్రాంగణం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దర్గా ప్రాంగణంలో రూ.84 లక్షలతో 120 శాశ్వత మరుగుదొడ్లు నిర్మించారు. హబీబ్ అజ్మీరీతో ఖవ్వాలీ ఏర్పాటు చేయనున్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 70 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.  
 
 రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి    
 - మంత్రి నారాయణ
 నెల్లూరు, సిటీ:  ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో సోమవారం పోలీస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్ అజీజ్, కమిషనర్ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
 
 7 జోన్లుగా దర్గా ప్రాంగణం    
 1వ జోన్: రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు.  
 2వ జోన్: రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువతో పాటు ఘాట్, పురుషులు, స్త్రీల స్నానపు గదులు, శాశ్వత మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.  
 3వ జోన్ :పినాకినీ గెస్ట్‌హౌస్ వైపు స్టాల్స్, వైద్య శిబిరాలు.  
 4వ జోన్: సయ్యద్ అహ్మద్‌బాబా దర్గా, ముసాఫిర్‌ఖానా ఉంచారు.
 5వ జోన్ : ఎగ్జిబిషన్, స్టాల్స్, వైద్య శిబిరాలు.  
 6వ జోన్ : బారాషాహిద్ దర్గా, ఆసిఫ్ హుస్సేన్‌బాబా దర్గా, దర్గా కమిటీ కార్యాలయం.
 7వ జోన్ :  దర్గా బయట వైపు మెరుున్‌రోడ్డు  
 

 భారీ భద్రత     
 -దర్గాలో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు
 (కొండ్రా హరిబాబు)
 బారాషాహీద్ దర్గాలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న రొట్టెల పండగకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.  గుంటూర్, ప్రకాశం జిల్లా లకు చెందిన  2100 మంది  పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.   
 డ్రోన్‌తో నిఘా
 దర్గా ఆవరణం, కోటమిట్ట. ప్రధాన కూడళల్లో 40సీసీ కెమెరాలు, 2పిటీజెడ్ కెమెరాలు, నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని నెల్లూరు, విజయవాడల్లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విజయవాడనుంచే ప్రత్యక్షంగా రొట్టెల పండగను పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.   
 
 ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి  

 ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా ఆవరణలోకి  వీవీఐపీ, వీఐపీ వాహనాలతోపాటు ముందస్తు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి.   


 పార్కింగ్ ప్రదేశాలివే  
 మాగుంటలే అవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం ఎదురుగా ఉన్న స్థలం, టీబీ హాస్పిటల్, కస్తూరిదేవిగార్డెన్ అండ్ స్కూల్, గుంటసుబ్బరామిరెడ్డి ఇంటి సమీపంలోని వక్ఫ్‌బోర్డు స్థలం, బట్వాడిపాలెం సెంటర్‌లోని మదరసా, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం(హాకీ ప్లేగ్రౌండ్), కొత్తగా నిర్మిస్తున్న జిల్లా  పోలీసు కార్యాలయ ఆవరణం, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, సాల్వేషనార్మి చర్చి ఆవరణలో(ద్విచక్రవాహనాలు నిలపాలి) వాహనాలు నిలపాల్సి ఉంది.   


 పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు  
 దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది అక్కడ భక్తులకు అందుబాటులో ఉంటారు.   భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గినా డయల్ 100, 9440796303, 9440796305, 9440700015కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారు.  
 
 ట్రాఫిక్ దారిమళ్లింపు  
 పొదలకూరువైపు నుంచి వచ్చే వాహనాలను పొదలకూరురోడ్డు , కొండాయపాలెం గేటు మీదుగా నగరంలోకి, పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు కేవీఆర్ పెట్రోల్ బంక్, బొల్లినేని, కొండాయపాలెం మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళుతారుు.  
 
 జొన్నవాడ నుంచి వచ్చే వాహనాలు బట్వాడిపాలెం సెంటర్, శాంతినగర్ మీదుగా నెల్లూరు నగరంలోకి, జొన్నవాడ వెళ్లే వాహనాలు అదే మార్గం గుండా జొన్నవాడకు వెళ్లేలా చర్యలు తీసుకొన్నారు.  
 
 సుజాతమ్మకాలనీ, ఎస్పీబంగ్లా, ప్రశాంతినగర్, అంబేడ్కర్ నగర వాసులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు అనుమతి ఇస్తామన్నారు.  
 
 బారాషహీద్ అంటే
 వీర మరణం పొందిన సంఖ్యను ఉర్దూలో బారా అంటారు(12) అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే బారాషహీద్ అనే పేరొచ్చింది. వారు ఉన్న దర్గానే నేడు మనం పిలుచుకునే బారాషహీద్ దర్గా.
 
 తలలు తెగిపడిన చోటే సాతోషహీద్ దర్గా
 కొడవలూరు మండలంలోని గండవరంలో వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్‌లకు
 మధ్య జరిగిన పవిత్రయుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగిపడ్డారుు.
 వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యారుు. అవన్నీ సమాధులుగా మారిన చోటే
 నేడు సాతోషహీద్ (సాత్ అంటే ఉర్దూలో ఏడు, షహీద్ అంటే వీరమరణం పొందినవారు) దర్గాగా పిలువబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement