- వీధికుక్కను వేధించిన కేసులో తీర్పు
సాక్షి ప్రతినిధి, చెన్నై
రోగులకు ప్రాణాలు పోసే వైద్యవృత్తిని అభ్యసిస్తున్న ఇద్దరు మెడికోలు వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఫలితంగా రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై కున్రత్తూరుకు చెందిన సుదర్శన్, ఆశిష్ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు ఒక వీధికుక్కను మూడో అంతస్తుపై నుంచి కిందకు విసిరివేశారు. ఈ వికృతచేష్టను మొబైల్‌లో చిత్రీకరించి ఆనందించారు. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్‌లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు. ఆరు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. జంతుసంక్షేమ సంఘం ప్రతినిధి ఆంథోనీ సదరు మెడికోలను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు మెడికోలు శ్రీపెరంబుదూరు న్యాయస్థానంలో లొంగిపోయారు. వీరిద్దరినీ మెడికల్ కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బైటపడిన కుక్కకు జంతుప్రేమికులు భద్ర అని పేరుపెట్టి అత్యున్నత చికిత్స అందజేశారు. కుక్క చికిత్సకు అయిన ఖర్చును, అపరాధం చెల్లించేలా మెడికోలను ఆదేశించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చెరి రూ.2 లక్షలను జంతు సంరక్షణ కేంద్రానికి చెల్లించాల్సిందిగా కోర్టు నియమించిన విచారణ బృందం మెడికోలను ఆదేశించింది. రూ.4 లక్షలను చెల్లించారు. దీంతో మెడికోల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్ కల్పించాల్సిందిగా వైద్యకళాశాల యాజమాన్యాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది.