పెళ్లి కార్డు వదంతులు నమ్మొద్దు
Published Wed, Nov 16 2016 1:09 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
నిబంధనల ప్రకారమే నోట్ల మార్పిడి
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
ఉప్పు, చక్కెర అధిక ధరలకు కొనొద్దు
జిల్లా ఎస్పీ మురళీధర్ వెల్లడి
మహబూబాబాద్ రూరల్ : సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి మోసపోవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మురళీధర్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా తీసుకోవాలని ఆదేశించిందన్నారు. కొంత మంది వ్యక్తులు పెళ్లి కార్డులను చూపిస్తే రూ.5 లక్షల నోట్ల మార్పిడీకి అవకాశం ఉంటుందని చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే నోట్ల మార్పిడి ఉంటుందన్నారు. ఉప్పు, చెక్కర అధిక ధరలకు అమ్మితే కొనవద్దన్నారు. సోషల్ మీడియాలలో పెళ్లి కార్డులకు డబ్బులపై జరుగుతున్న ప్రచారంపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి భూ వివాదాల కేసులే ఎక్కువగా వస్తున్నాయన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసు శాఖ తలదూర్చదని, రెవెన్యూ శాఖ పరిష్కారం చూపుతుందని అన్నారు.
సిటీల్లో చదువుకున్న వారే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మహబూబాబాద్‌లో రెండు బీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటిని నాలుగు బీట్లుగా మార్చామని చెప్పారు. హైదరాబాద్ తరహాలో నేరాల అదుపునకు లక్కింగ్ బీట్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారంటున్న గార్లకు చెందిన దేవిరెడ్డి విజయ్ గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు పెంచుతామని ఎస్పీ చెప్పారు.
Advertisement
Advertisement