ముంబై: నగరమంతా సచిన్ నామస్మరణతో మారుమోగింది. ఎక్కడా చూసినా కెరీర్‌లో చివరి, 200వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సచిన్ ఎన్ని పరుగులు తీస్తాడు? ఇన్నాళ్లు సేవలు చేసినందుకు ఘనమైన వీడ్కోలు లభిస్తుందా? క్రికెట్ తొలినాళ్లలో ఆడిన ఆటతీరునే ప్రదర్శిస్తాడా? తదితర విషయాలు గురించి ముంబైకర్లు చర్చించుకోవడం కనిపించింది. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌కు సేవలందిస్తున్న ముంబై వీరుడు టెండూల్కర్ సొంత గడ్డ వాంఖడే స్టేడియంలోనే కెరీర్ చివరి, 200వ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తుండిపోయేలా ఉండాలని మనసారా ఇష్టదైవాలను వేడుకున్నారు. అయితే అభిమానుల హీట్‌కు తగ్గట్టుగానే నగరంలోని వివిధ ప్రాంతాల్లో మాస్టర్ బ్లాస్టర్‌కు అభినందనలు తెలిపే హోర్డింగ్‌లు వెలిశాయి. సచిన్ గౌరవార్థం తాజ్ హోటల్‌లో ఓ అభిమాని పువ్వులతో బ్యాట్, బంతి, వికెట్లు తయారుచేశాడు. వాంఖడే స్టేడియం సమీపంలోనే భారీ హోర్డింగ్ వెలిసింది. ఠాణేలోని సెంట్రల్ గ్రౌండ్‌లో సామాజిక కార్యకర్త శరద్ బెల్ శేఖర్ 200 బెలూన్లను ఎగరవేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అభిమానులు వివిధ ప్రాంతాల్లో తమకు నచ్చిన రీతిలో సచిన్‌ను గౌరవిస్తూ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సచిన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, మొహర్రం ప్రభుత్వ సెలవు దినం కావడంతో అత్యధిక మంది నగరవాసులు టీవీలు అంటిపెట్టుకొని మ్యాచ్‌ను వీక్షించడం కనబడింది.
ప్రముఖ క్రికెట్ మైదానాలుగా నగరంలో పేరున్న శివాజీ పార్క్, అజాద్ మైదాన్‌లో సచిన్ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగినా క్రికెట్ మ్యాచ్‌లు యధావిధిగా సాగాయి. రోజుమాదిరిగానే అందరూ మైదానాలకి వచ్చి క్రికెట్ ఆడారు. సచిన్ గురించి చర్చించుకున్నా ఆటపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. టెండూల్కర్ తొలినాళ్లలో ఎక్కువ ప్రాక్టీసు చేసిన దాదర్‌లోని శివాజీ పార్క్‌లో క్రికెట్ సందడి కనిపించింది. నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ ఆరాధ్య గురువైన రమాకాంత్ అచ్రేకర్ కుమారుడు కల్పన ముర్కర్ ఇదే శివాజీ పార్క్‌లో ఔత్సాహిక క్రికెటర్లకు ఆటలో మెళకువలను నేర్పించాడు. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్ మ్యాచ్‌లు ఆడాయి. ఒక మ్యాచ్‌లో నానావతిని బీఎంసీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నిర్లోన్ జట్లు ఎదుర్కొన్నాయి. మరికొంత మంది ఆట ఆడుతునే చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని సచిన్ మ్యాచ్ కామెంటెరీని వినడం కనిపించింది. ‘శివాజీ పార్క్‌లో క్రికెట్‌ను ఎవరూ ఆపలేరు. ఎవరు రిటైరైనా ఆట కొనసాగుతునే ఉంటుంది. ఈ మైదానంలో ఒక్కరోజు కూడా క్రికెట్ ఆగవద్దని సచిన్ కూడా భావిస్తాడ’ని బీఎంసీ తరఫున ఆడిన విశాల్ పఠక్ తెలిపారు. ‘జీవితం కొనసాగుతూనే ఉంటుంది. శివాజీ పార్క్‌లో రోజుచేసే ప్రాక్టీసు చేసే వాళ్లలో నుంచి మరొక సచిన్ వస్తాడనే ఆశ ఉంద’ని యూబీఐ తరఫున ఆడిన రాకేశ్ షా అన్నారు. అజాద్ మైదాన్‌లోనూ రోజువారి మాదిరిగానే అనేక మంది పిల్లలు చేరి క్రికెట్ ఆడారు. ‘టెండూల్కర్ వీడ్కోలు గురించి ఎంతో అతృతతో ఉన్నాం. అయితే మా రోజువారీ ప్రాక్టీసును మిస్ కాలేం. తొందరగా శిక్షణ తీసుకొని ఇంటికి వచ్చి టీవీల్లో మ్యాచ్ చూస్తామ’ని అనిల్ పఠక్ అన్నాడు.
టెండూల్కర్ నామస్మరణలో ముంబై
Published Fri, Nov 15 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement