- విత్తన చట్ట సవరణపై వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే
- ప్రస్తుత చట్టంతో బోగస్ కంపెనీలపై చర్యలు తీసుకోలేమని వివరణ
- ఈ సమావేశాల్లోనే బిల్లుపై లోక్‌సభలో చర్చ ఉంటుందని వెల్లడి
ముంబై: బోగస్ విత్తన కంపెనీలను నిరోధించేందుకు విత్తన చట్టాన్ని మరింత సమర్థంగా చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపామని రాష్ట్రప్రభుత్వం విధానమండలిలో తెలిపింది. ‘సోయాబీన్ విత్తన శాంపుల్స్‌ను పరిశోధన శాల పంపి పరీక్షలు జరపగా, వాటికి మొలకెత్తే సామర్థ్యం 50 శాతం కన్నా తక్కువగా ఉందని వెల్లడైనట్లు నివేదిక వచ్చింది. ఒక వేళ ఆ నివేదిక నిజమే అయితే బోగస్ విత్తన కంపెనీలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది. చర్యలేవీ తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు ’ అని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేంద్ర ములాక్ ప్రశ్నించారు.
దీనికి వివరణ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే, ‘విత్తన చట్టం-1966 ను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కంపెనీలు నేరం చేసినట్లు మొదటి సారి రుజువైతే రూ. 500 జరిమానా, రెండో సారి అదే నేరాన్ని పునరావృతం చేస్తే 6 నెలలు జైలు శిక్ష. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సమర్థంగా తీర్చిదిద్దాలని కోరుతూ కేంద్రానికి గత ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లుపై చర్చించనున్నట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది’ అని తెలిపారు.
ఒకే ఒక్కటి..
‘విత్తన నాణ్యత తెలుసుకునేందుకు ప్రస్తుతం వారణాసిలో ఒకే ఒక్క పరిశోధన శాల ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షలకు విత్తన శాంపుల్స్ అక్కడికే వెళ్తాయి. కేంద్ర నిబంధనల ప్రకారం ఒక నెలలోపు పరీక్షల ఫలితాలను సిద్ధం చేయాలి. కాని 6 నుంచి 8 నెలల సమయం పడుతోంది’ అని ఖడ్సే వివరించారు. ‘బిల్లును సవరించే వరకు బోగస్ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉండవు. బోగస్ విత్తనాల బాధితులు వినియోగదారుని కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చు’ అని అన్నారు.
‘విత్తన’ ప్రతిపాదన పంపించాం
Published Thu, Jul 30 2015 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement