70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర | Shankara Vijayendra Saraswathi is the 70th Peetadhipathi for kanchi kamakoti matam | Sakshi
Sakshi News home page

70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి

Published Thu, Mar 1 2018 3:56 AM | Last Updated on Thu, Mar 1 2018 9:35 AM

Shankara Vijayendra Saraswathi is the 70th Peetadhipathi for kanchi kamakoti matam - Sakshi

సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్‌. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు. పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపు, దేశంలో సాంస్కృతిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, కొరవడుతున్న నైతిక, మానవీయత విలువల్ని రక్షించే రీతిలో ఆయన పయనం సాగించారు. యువకుల్లో చైతన్యం లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పురాతన సాహిత్యాన్ని కాపాడడం, భారతీయ, విదేశీ భాషల్లో భక్తుల కోసం అనేక ప్రచురణలను తీసుకొచ్చారు. 

పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రం.. కాంచీపురం
దక్షిణ భారతంలో ఉన్న శివ ఆరాధనలో పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రంగా కాంచీపురం అలరారుతోంది. ఈ క్షేత్రంలోని కంచి కామకోటి పీఠానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆది శంకరాచార్య చేతుల మీదుగా ఆవిర్భవించిన ఈ మఠం ద్వారా హిందూ మత సేవలో రెండు దశాబ్దాలకు పైగా జయేంద్ర సరస్వతి నిమగ్నమయ్యారు. భౌగోళికంగా భూమి(కాంచీపురం), ఆకాశం(కడలూరు జిల్లా చిదంబరం), గాలి( చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి), అగ్ని(తిరువణ్ణామలై), నీరు(తిరువన్నై కోయిల్‌) క్షేత్రాలను పిలుస్తుంటారు. వీటన్నింటి సమ్మేళనంతో శ్రీ కంచి కామకోటి పీఠం ఆవిర్భవించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మఠానికి తల భాగంగా శంకరాచార్య వారిని అభివర్ణిస్తుంటారు. క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి ఈ మఠాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

ఈ కామకోటి పీఠం సంప్రదాయంగా కామాక్షి అమ్మవారిని సూచిస్తుంటుంది. కామకోటి దుర్గాదేవిని సూచిస్తుంది. శ్రీ శంకర భగవత్పాడ(శ్రీశంకరాచార్య) స్వామి వారు కంచిలో స్థిరపడుతూ తన కంటూ ఓ సొంత నివాసంగా ఈ మఠాన్ని నెలకొల్పారు. ఆయన అడుగు జాడల్లో శిష్యులైన శ్రీ సురేశ్వర చార్య, సర్వజ్నాత్మాన్, సత్య భోదేంద్ర సరస్వతి, జ్ఞానందేంద్ర సరస్వతి, సుధానందేంద్ర సరస్వతి వంటి పీఠాధిపతుల నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఈ పీఠం ముందుకు సాగింది.  ఇది వరకు ఉన్న 68 మంది పీఠాధిపతులతో పోల్చితే, జయేంద్ర సరస్వతి ఈ పీఠం పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారంలో విశిష్ట సేవల్ని అందించారు. ఆధ్యాత్మికమే కాదు, విద్య, వైద్య, సేవాపరంగానూ ఈ మఠాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement