ఎన్‌కౌంటర్‌పై ఉధృతమైన ఆందోళనలు
హెరిటేజ్‌పై పెట్రోబాంబు
హైకోర్టులో పిటిషన్లు
శేషాచలం ఎన్‌కౌంటర్ చిచ్చు తమిళనాడులో రగులుతూనే ఉంది. ఆదివారం కాస్త తగ్గినప్పటికీ, సోమవారం ఆందోళనకారులు మళ్లీ విజృంభించారు. చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై పెట్రోబాంబు విసిరి పరారయ్యారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చిత్తూరు శేషాచలం కాల్పులపై ఐదురోజుల పాటు అవిశ్రాంతంగా నిరసనలు తెలిపిన ఆందోళనకారులు సోమవారం మళ్లీ విజృంభించారు. పలుచోట్ల తమ నిరసన తెలిపారు. చిత్తూరు శేషాచల అడవుల్లో 20 మంది తమిళ కూలీల మృత్యువాతను తమిళ ప్రజలు మరిచిపోలేకున్నారు. కాల్పులపై సీబీఐ విచారణ జరపాలని, సుప్రీం కోర్టు న్యాయమూర్తిని విచారణకు నియమించాలని, కాల్పులకు కారణమైన ఏపీ పోలీసులపై హత్యానేరం మోపాలని ఇలా అనేక డిమాండ్లతో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్నట్లుగా రాష్ట్రంలో ఎటువంటి ఆందోళనలు చోటుచేసుకోలేదు. అయితే సోమవారం తెల్లారేసరికి ఏపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మళ్లీ మిన్నంటింది.
ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక తమిళ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రజల గుండెల్లో మరోసారి మంటలను రేపింది. రాజకీయ పార్టీ నేతలను రెచ్చగొట్టింది. ఆరిపోతున్న చిచ్చులో ఆజ్యం పోసింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రంలో కార్చిచ్చును రగిల్చింది. పార్టీలకు అతీతంగా ఏపీ ప్రభుత్వంపై మండిపడేలా చేసింది. చెన్నై ఐనవరంలోని హెరిటేజ్ సూపర్‌మార్కెట్ వద్దకు రెండుబైక్‌లలో వచ్చిన నలుగురు దుండగులు లోనికి జొరబడి పెట్రోబాంబును విసిరి పరారయ్యారు. అయితే అదృష్టవశాత్తు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మార్కెట్‌కు అమర్చిన సీసీ టీవీ కెమెరాల పుటేజీ ఆధారంగా నామ్‌తమిళర్ కట్చికి చెందిన వాగైవేందన్, గౌతమన్, మణికంఠన్, శశికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ న్యాయకళాశాల విద్యార్థులు మైలాపూరులో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
సీమాన్ పిటిషన్ కొట్టివేత
కాల్పుల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నామ్‌తమిళర్ కట్చి అధినేత సీమాన్ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కాల్పులపై ఉదంతంపై ఏపీ హైకోర్టు సుప్రీం కోర్టుల్లో పిటిషన్, ఏపీ డీజీపీకి అక్కడి హైకోర్టు కాల్పులపై నివేదికను కోరుతూ ఆదేశాలు ఇచ్చినందున మద్రాసు హైకోర్టు అదేశాలు అవసరం లేదంటూ న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఆర్ అమల పిటిషన్‌ను కొట్టివేశారు. మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం చేయాలని మృతుని తల్లి మునియమ్మాళ్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తొలుత తోసిపుచ్చింది. కాల్పుల ఘటన, కేసులు ఏపీ పరిధిలో ఉన్నందున తాము ఆదేశించలేమని పేర్కొంది. అయితే, ఆరు మృతదేహాలు తమిళనాడు పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నందున మళ్లీ పోస్టుమార్టంకు ఆదేశించే హక్కు కోర్టుకు ఉందని బాధితురాలి తరపు న్యాయవాది వాదించడంతో విచారణకు అంగీకరించింది.
మళ్లీ రగడ
Published Tue, Apr 14 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement