‘డమ్మీ’ ఎమ్మెల్యేపై దుమారం
ముంబై: ఎమ్మెల్యే పాల్గొనాల్సిన కార్యక్రమంలో ‘డమ్మీ’ ప్రత్యక్షం కావటంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలివీ.. అధికార శివసేన ఇటీవల రైతులతో ముఖాముఖి ‘శివ్ సంపర్క్ అభియాన్’ చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడాల్సి ఉంది.
కాగా, శివసేనకు చెందిన పింప్రిచించ్‌వాడ్ ఎమ్మెల్యే గౌతమ్ చబుకేశ్వర్ విహారయాత్రల్లో ఉన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తనకు కేటాయించిన మరాఠ్వాడ ప్రాంతంలోని ఒస్మానాబాద్ ప్రాంతంలో రైతులతో మాట్లాడాల్సి ఉండటంతో ఎమ్మెల్యే గౌతమ్ తరుణోపాయం కనిపెట్టారు. తన విహార యాత్రలకు భంగం కలుగకుండా ఉండేందుకు, పార్టీ ఉత్తర్వుల మేరకు తన తరఫున యశోధర్ ఫణసే అనే మాజీ కార్పొరేటర్‌ను పురమాయించారు. ఈ మేరకు యశోధర్ శివ్ సంపర్క్ అభియాన్‌లో పాల్గొన్నారు. తనకు తాను ఎమ్మెల్యే గౌతమ్ చబుకేశ్వర్‌గా పరిచయం చేసుకుని బాధ్యతలను నెరవేర్చారు.
అయితే, ఈ విషయం ప్రతిపక్షాలు పసిగట్టాయి. పోలీసులు దీనిపై సుమోటొగా పరిగణించి ఎమ్మెల్యేపై మోసం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే చబుకేశ్వర్, ఫణసేలు ఈ ఆరోపణలను ఖండించారు.