బీజేపీపై తమ మిత్రపక్షం శివసేన మరోమారు ఫైర్ అయ్యింది.
సాక్షి, ముంబై: బీజేపీపై తమ మిత్రపక్షం శివసేన మరోమారు ఫైర్ అయ్యింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుపొందినా.. శివసేన లేకుండా అధికారం దక్కించుకోలేక పోయిందని ఆ పార్టీ నేత అనీల్ దేశాయ్ ఎద్దేవా చేశారు. ‘ఒంటరిగా పోటీ చేయడం వల్లే మా బలం తెలిసింది. పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లే 120 స్థానాలు గెలుపొందాం’ అని ఆదివారం కొల్హాపూర్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర ్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన అనీల్ సోమవారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలే శివసేన బలమని, శివసేన అనేది ఒక శక్తి అని అభివర్ణించారు. అయితే బీఎంసీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో బీజేపీతో కలసి ప్రభుత్వంలో పాలుపంచుకుంటున్నా.. తమ పాత్రను శివసేన స్పష్టంగా తెలుపుతూ వస్తోందని అన్నారు. వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.