సాక్షి, ముంబై: మంత్రి మండలి విస్తరణకు ముహూర్తం ఇప్పట్లో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మంత్రి మండలిలో స్థానం దక్కించుకునేందుకు అనేక మంది శివసేన, బీజేపీ నాయకులు ఆసక్తి చూపుతుండడంతో విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించనున్నట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మంత్రి మండలిలో మరో 12 మందికి అవకాశం కల్పించనున్నారు.
దీంతో శివసేన, బీజేపీ నాయకులతోపాటు ఇతర మిత్రపక్షాలు కూడా మంత్రిమండలిలో తమకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణ్‌వీస్‌పై ఒత్తిడి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీతో సయోధ్య అనంతరం శివసేన మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేనకు 12 మంత్రి పదవులను కేటాయించారు. ఆ పార్టీకి మరో పదవులను ఇవ్వనున్నారు.
ఆ రెండు పదవుల కోసం శివసేన నాయకుల్లో పోటీ ఏర్పడినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు శివసేన నుంచి నీలం గోరే, గులాబ్‌రావ్ పాటిల్, విజయ్ ఔటి, అర్జున్ ఖోత్కర్, రాజేష్ క్షీరసాగర్, సుజిత్ మించేకర్‌లు మంత్రిపదవి కోసం పడుతున్నట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ సభ్యులు మంత్రులయ్యేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఆ పార్టీ నుంచి అశీష్ శెలార్, మంగల్‌ప్రభాత్ లోదా, పాండురంగ్ ఫుండ్‌కర్, చైన్‌సుఖ్ సంచేతి తదితరులతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేల పేర్లు విన్పిస్తున్నాయి.
మరోవైపు ఇతర మిత్రపక్షాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రీయ సమాజ్ పార్టీ’ (ఆర్‌ఎస్‌పి) నేత మహాదేవ్ జాన్కర్, స్వాభిమాని శేత్కరి సంఘటన నాయకులు సదాభావు ఖోత్‌లకు చోటు దక్కనుందని తెలిసింది. మరోవైపు ఆర్‌పీఐ కోటాలో ఆ పార్టీ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే మంత్రి మండలిలో చేరేందుకు అంగీకరిస్తే కేబినేట్‌లో ఆయనకు అవకాశం ఇవ్వాలని లేదా ఇతర ఎమ్మెల్యేను ప్రతిపాదిస్తే సహాయ మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మంత్రి మండలిలో చేరేందుకు ఆసక్తి కనబరిచేవారి సంఖ్య అధికంగా ఉండడంతో, ఎమ్మెల్యేలు, జిల్లాల వారీగా పదాధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని బీజేపీ, శివసేనలు భావిస్తున్నాయి. ఫలితంగా నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించాలని భావించినప్పటికీ జాప్యమయ్యే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి.
కేబినెట్ విస్తరణ ఎప్పుడు?
Published Sun, Jan 4 2015 10:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement