Expansion of Council of Ministers
-
మిత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ
సాక్షి, ముంబై: బీజేపీ వైఖరిపై స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, ఆర్పీఐ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మండలి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న వీరికి బీజేపీ వైఖరితో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నాలుగు విధాన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న మిత్రులకు బీజేపీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. విధానమండలికి ఎన్నికై ఆ తరువాత మంత్రి పదవికి ఎర వేయాలనుకున్న మిత్రుల ఆశలను బీజేపీ మొగ్గలోనే తుంచివేసింది. మూడు స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని, మరో స్థానం శివసేనకు వదిలేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 2017 ప్రారంభంలో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రామ్‌దాస్ ఆఠవలేకు చెందిన ఆర్పీఐకి ఓ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అందువల్ల మండలి స్థానాల్లో ఒకటి ఆర్పీఐకి కేటాయించనున్నట్టు సమాచారం. ఇక శివసంగ్రామ్ పార్టీ నాయకుడు వినాయక్ మెటే ఇటీవలే బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో ఆయనకు కూడా మంత్రి పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకు గాను వినాయక్ మెటే బీజేపీ టికెట్‌పై శాసనమండలికి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో స్థానంలో బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీని బరిలోకి దింపనున్నారని తెలిసింది. దీనిని బట్టి స్వాభిమానిషేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పార్టీలకు కేబినెట్లో చోటు లేనట్టేనని భావిస్తున్నారు. లోకసభతోపాటు శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత మిత్రపక్షాలకు బీజేపీ నుంచి సరైన ఆదరణ లభించడంలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. శివసేనను వీడి తప్పుచేశాం..! అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివసేనను వీడి తప్పుచేశామన్న భావనను ఆర్పీఐ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే వ్యక్తంచేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివసేనతో ఉండి ఉంటే తమ పార్టీకి సరైన న్యాయం జరిగేదని పేర్కొన్నారు. శివసేనతో పొత్తుపెట్టుకుని ఉంటే ఆ పార్టీ స్థానాలు మరో 30 నుంచి 35 పెరిగేవి. దీంతో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రం, కేంద్రంలో ఆర్పీఐని బాగస్వామ్యం చేసుకుంటామని బీజేపీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కేబినెట్ విస్తరణ ఎప్పుడు?
సాక్షి, ముంబై: మంత్రి మండలి విస్తరణకు ముహూర్తం ఇప్పట్లో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మంత్రి మండలిలో స్థానం దక్కించుకునేందుకు అనేక మంది శివసేన, బీజేపీ నాయకులు ఆసక్తి చూపుతుండడంతో విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించనున్నట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మంత్రి మండలిలో మరో 12 మందికి అవకాశం కల్పించనున్నారు. దీంతో శివసేన, బీజేపీ నాయకులతోపాటు ఇతర మిత్రపక్షాలు కూడా మంత్రిమండలిలో తమకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణ్వీస్పై ఒత్తిడి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీతో సయోధ్య అనంతరం శివసేన మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేనకు 12 మంత్రి పదవులను కేటాయించారు. ఆ పార్టీకి మరో పదవులను ఇవ్వనున్నారు. ఆ రెండు పదవుల కోసం శివసేన నాయకుల్లో పోటీ ఏర్పడినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు శివసేన నుంచి నీలం గోరే, గులాబ్రావ్ పాటిల్, విజయ్ ఔటి, అర్జున్ ఖోత్కర్, రాజేష్ క్షీరసాగర్, సుజిత్ మించేకర్లు మంత్రిపదవి కోసం పడుతున్నట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ సభ్యులు మంత్రులయ్యేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఆ పార్టీ నుంచి అశీష్ శెలార్, మంగల్‌ప్రభాత్ లోదా, పాండురంగ్ ఫుండ్కర్, చైన్సుఖ్ సంచేతి తదితరులతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేల పేర్లు విన్పిస్తున్నాయి. మరోవైపు ఇతర మిత్రపక్షాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రీయ సమాజ్ పార్టీ’ (ఆర్ఎస్పి) నేత మహాదేవ్ జాన్కర్, స్వాభిమాని శేత్కరి సంఘటన నాయకులు సదాభావు ఖోత్లకు చోటు దక్కనుందని తెలిసింది. మరోవైపు ఆర్పీఐ కోటాలో ఆ పార్టీ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే మంత్రి మండలిలో చేరేందుకు అంగీకరిస్తే కేబినేట్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని లేదా ఇతర ఎమ్మెల్యేను ప్రతిపాదిస్తే సహాయ మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి మండలిలో చేరేందుకు ఆసక్తి కనబరిచేవారి సంఖ్య అధికంగా ఉండడంతో, ఎమ్మెల్యేలు, జిల్లాల వారీగా పదాధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని బీజేపీ, శివసేనలు భావిస్తున్నాయి. ఫలితంగా నూతన సంవత్సరం మొదటివారంలో మంత్రి మండలిని విస్తరించాలని భావించినప్పటికీ జాప్యమయ్యే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి.