గ్రామాన్ని దత్తత తీసుకుంటా
గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడీమె దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.తమిళంలో విజయ్ సరసన నటించిన భారీ చిత్రం పులి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా ఏఎం.రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబుతో నటించిన శ్రీమంతుడు చిత్రం ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింబడుతోంది.
ఇది చిత్ర కథానాయకుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దీన దశలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం. కథానాయికి గ్రామీణాభివృద్ధికి పాటు పడే విద్యను చదువుతుంది. ఇది శ్రుతిహాసన్ పోషించిన పాత్ర. కాగా శ్రుతిహాసన్ తన ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతి వృత్తంతో కూడిన శ్రీమంతుడు చిత్రంలో నటించారు. నిజ జీవితంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అన్న అభిమాని ప్రశ్నకు తప్పకుండా.అలాంటి ఆలోచన నాకు ఉంది అని బదులిచ్చారు.
దృఢమైన వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని నా తండ్రి కమలహాసన్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. తన వంతు సేవ ప్రజలకు చేస్తాను. అలాగే నటిగా బిజీగా ఉన్నా సంగీతంపై ఇష్టంతో త్వరలో ఒక మ్యూజికల్ ఆల్బమ్ చెయ్యాలనుకుంటున్నాను. నాకు నచ్చిన విహార ప్రాంతం లాస్ ఏంజిల్స్. ఇష్టమైన వంటకం సాంబారు అన్నం. ఇక తన చెల్లెలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను అందరికీ నచ్చే అమ్మాయి.