టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది.
కాగా.. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!)
గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాతే శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని.. తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది.
అంతే కాకుండా మీ పిటిషన్‌న డిస్మిస్ చేయమంటారా? మీరే వెనక్కి తీసుకుంటారా? అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో సుప్రీం ఓకే చెప్పింది. కాగా.. కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment