village adopted
-
మనసున్న మా'రాజు'
ఆచంట: దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోక సమస్యలతో సతమతమవుతున్న ఆచంట మండలం అయోధ్యలంక వాసులకు మంచిరోజులొచ్చాయి. లంక గ్రామస్తుల సమస్యలు స్వయంగా పరిశీలించిన ఆచంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. లంక గ్రామంలో పర్యటించిన ఆయన అయోధ్యలంకను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రజలకు వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని గ్రామాల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి అయోధ్యలంకకు పడవపై ప్రయాణించారు. ఈ సందర్భంగా లంక వాసులు తమ ఇబ్బందులు రంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా లంక గ్రామం చుట్టూ గోదావరి ఉన్నా తాగడానికి మంచీనీరు అందక పడుతున్న ఇబ్బందులు వెల్లడించారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఆయన గ్రామంలో సొంత నిధులతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి సురక్షితమైన మంచినీరు ఓ ఆటోలో ఇంటింటికీ పంపిస్తానని హామీ ఇవ్వడంతో లంక గ్రామ వాసుల ఆనందానికి అవధులు లేవు. ఆయన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే సొంత ఖర్చులతో తీరుస్తానని హామీ ఇచ్చారు. విద్యా వలంటీర్ల ఏర్పాటు అయోధ్యలంకలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు కుంటుపడుతున్నాయని గ్రామస్తులు చెప్పడంతో ఆయా నాలుగు పాఠశాలల్లో నలుగురు విద్యా వలంటీర్లను నియమిస్తానని రంగనాథరాజు చెప్పారు. ఇదేవిధంగా లంక గ్రామంలో తరచూ పాముల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలుపగా గ్రామంలోని డిస్పెన్సరీలో ఫ్రిజ్ ఏర్పాటు చేసి అందులో పాముకాటు మందు అందుబాటులో ఉంచుతామని, వైద్య సిబ్బందిని నియమిస్తానని చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే తన సొంత నిధులతో పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. వారధి నిర్మాణానికి కృషి.. అయోధ్యలంక వాసులు గ్రామం చేరుకోవాలంటే పడవ ప్రయాణమే దిక్కు. ఏళ్ల తరబడి అయోధ్యలంక–పుచ్చల్లంక గ్రామాల మధ్య వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అయితే లంకలో పర్యటించిన రంగనాథరాజు తమ పార్టీ అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే విధంగా గ్రామంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఆయన ప్రకటించిన నవరత్నాల పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతాయన్నారు. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రంగనాథరాజు హామీలతో అయోధ్యలంక వాసులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యటనలో మండల పార్టీ అధ్యక్షుడు ముప్పాల వెంకటేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, ఎంపీటీసీ పెచ్చెట్టి సత్యనారాయణ, పార్టీ నాయకులు గొల్లపల్లి బాలకృష్ణ, యన్నాబత్తుల ఆనంద్, చెల్లెం వరప్రసాదు, మానుకొండ సత్యనారాయణ, రొక్కాల వెంకటేశ్వరరావు, సరెళ్ల రాజు, వడ్లమూడి శ్రీనివాసరావు, గొల్ల సురేష్, కాంపాటి రాజు, మాజీ ఎంపీటీసీ గొర్రె వెంకటనారాయణ, మడిమెట్ల రాంబాబు, కామన హరిబాబు, వస్కా ఉమేష్, నెక్కంటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన వైఎస్సార్సీపీ నాయకుడు వడ్లమూడి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. -
ప్రతి గెజిటెడ్ అధికారి ఒక గ్రామం దత్తత
టీజీవో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హన్మకొండ: ప్రతి గెజిటెడ్ అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. సోమవారం హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల 2017 డైరీ, క్యాలెండర్‌ను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలితో కలసి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న గ్రామం, డివిజన్లో నెలలో కనీసం రెండు రోజులు పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడం, సంబంధిత అధికారులతో మాట్లాడి అమలయ్యేలా చూడటం, సామాజిక అసమానతలు రూపుమాపడం, సామాజిక రుగ్మతలు తొలగించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వరంగల్ నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. -
ఈ సారి మహేశ్‌బాబుతో వస్తా
ప్రజావసరాల ప్రాతిపదికగా అభివృద్ధి మహేశ్‌బాబు దత్తత గ్రామంపై నమ్రతా శిరోడ్కర్ తెనాలి: ప్రజల అవసరాలను తెలుసుకుని, వాటి ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం అభివృద్ధిని చేపడతామని, అప్పుడే ఎంత మొత్తంలో తమ నిధులు కేటాయించేదీ వెల్లడిస్తామని సినీహీరో మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ చెప్పారు. తొలి ప్రాధాన్యతగా ఆరోగ్య ఉప కేంద్రం టేకప్ చేస్తామన్నారు. మహేశ్‌బాబు త్వరలోనే బుర్రిపాలెం సందర్శిస్తారని తెలిపారు. సినీహీరో కృష్ణ స్వస్థలం అయిన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని ఆయన కుమారుడు మహేశ్‌బాబు దత్తత తీసుకున్న విషయం విదితమే. గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు నమ్రతా శిరోడ్కర్.. మహేశ్ సోదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య పద్మావతితో కలసి గురువారం బుర్రిపాలెంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలో చేపట్టాల్సిన పనులను మహేశ్‌బాబు, ఎంపీ జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజా నిర్ణయిస్తారని చెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి..: గ్రామంలో బహిరంగ మలవిసర్జనను మాన్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్నది స్మార్ట్ విలేజ్‌లో భాగమని గుర్తుచేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకూ కొన్ని అవసరాలున్నాయని, ప్రతి విద్యార్థి సౌకర్యవంతంగా పాఠశాలకు వచ్చి ఆనందంగా పాఠాలు నేర్చుకునేలా చూడాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. వివిధ పద్దుల నుంచి గ్రామానికి ఇప్పటికే రూ.1.20 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, టీడీపీ నేతలు, గల్లా యూత్ ఫోర్స్ యువకులు పాల్గొన్నారు. -
గ్రామాన్ని దత్తత తీసుకుంటా
గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడీమె దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు.తమిళంలో విజయ్ సరసన నటించిన భారీ చిత్రం పులి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా ఏఎం.రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబుతో నటించిన శ్రీమంతుడు చిత్రం ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింబడుతోంది. ఇది చిత్ర కథానాయకుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దీన దశలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం. కథానాయికి గ్రామీణాభివృద్ధికి పాటు పడే విద్యను చదువుతుంది. ఇది శ్రుతిహాసన్ పోషించిన పాత్ర. కాగా శ్రుతిహాసన్ తన ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతి వృత్తంతో కూడిన శ్రీమంతుడు చిత్రంలో నటించారు. నిజ జీవితంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అన్న అభిమాని ప్రశ్నకు తప్పకుండా.అలాంటి ఆలోచన నాకు ఉంది అని బదులిచ్చారు. దృఢమైన వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని నా తండ్రి కమలహాసన్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. తన వంతు సేవ ప్రజలకు చేస్తాను. అలాగే నటిగా బిజీగా ఉన్నా సంగీతంపై ఇష్టంతో త్వరలో ఒక మ్యూజికల్ ఆల్బమ్ చెయ్యాలనుకుంటున్నాను. నాకు నచ్చిన విహార ప్రాంతం లాస్ ఏంజిల్స్. ఇష్టమైన వంటకం సాంబారు అన్నం. ఇక తన చెల్లెలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను అందరికీ నచ్చే అమ్మాయి. -
గంగారం.. ఇక సింగారం
‘సంసద్ ఆదర్శ్’ కింద ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆ గ్రామ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో జిల్లా యంత్రాంగం సహాయంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, మోడల్ గ్రామంగా తీర్చి దిద్ది ప్రధాని నరేంద్రమోదీని తీసుకువస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల ఏర్పాటుతో పాటు పచ్చదనంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు సర్పంచ్ అధ్యక్షతన తొమ్మిది మందితో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. - సత్తుపల్లి సత్తుపల్లి మండల కేంద్రం తర్వాత గంగారం గ్రామం అతివేగంగా పట్టణీకరణ వైపు పరుగుతీస్తోంది. ఇప్పటికే అక్కడక సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, దాసరి వీరారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, సాయిస్ఫూర్తి డీఏవీ ఇంగ్లిష్ మీడియంలో స్కూల్‌తో విద్యారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గంగారం గుట్టపై 15వ గిరిజన బెటాలియన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ స్వరూపం.. : గంగారం గ్రామపంచాయతీలో రామగోవిందాపురం, మేడిశెట్టివారిపాలెం అవాస గ్రామాలుగా ఉన్నాయి. ప్రకాష్‌నగర్‌కాలనీ, పాత హరిజనవాడ, జలగంనగర్, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. జనాభా 5451, ఓటర్లు 3,378, బీసీలు 1790, ఎస్సీలు 700, ఎస్టీలు 550లు మంది ఉన్నారు. వందకుపైగా పూరిల్లు ఉన్నాయి. గ్రామంలో 800 ఎకరాల ఆయకట్టు ఉన్న చింతల చెరువు, వడ్లజగయ్యకుంట 20 ఎకరాలకు, రామగోవిందాపురం కుంట 30 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. సహకారం అందిస్తున్న ‘తాన్ల’... అలాగే గ్రామాభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని ‘తాన్ల’ సొల్యూషన్స్ అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి ముందుకు వచ్చారు. అందులో భాగంగా గ్రామంలోని సమస్యలను సంపూర్ణంగా తెలుసుకునేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదేళ్ల క్రితం సుమారు రెండు కోట్ల రూపాయలతో బీటీరోడ్లు, డ్రైయిన్లు, రోడ్ల పక్కన పచ్చని మొక్కలు నాటారు. ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమస్యలను కిందిస్థాయి నుంచి తెలుసుకునేందుకు 34 మంది తో ఇంటింటి సర్వే చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనవంతు సహకారం అందించి సొంత గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో పెట్టేందుకే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలపై దృష్టి సారించరూ.. : గ్రామంలో దీర్ఘకాలికంగా సర్వే నంబర్ 133 ఆన్లైన్ కాక పోవడంతో ఈ పహాణీలు రాక రైతులు రుణాలకు నోచుకోలేక పోతున్నారు. భూముల క్రయ విక్రయాలు నిలిచి పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నారు. గ్రామంలో సమీపంలోని 16 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే రామగోవిందాపురం ఫ్లోరైడ్ ప్రాజెక్టు ఉన్నా.. గ్రామంలోని జలగంనగర్, ఎస్టీ కాలనీ, గురుభట్లగూడెం రోడ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరైడ్ రహితనీరు సరఫరా చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. మరుగుదొడ్లు సరిపడా లేక బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్కింద 150 మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో 40 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. హిందూ శ్మశాన వాటికలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖననం చేసేందుకు, కాల్చటానికి కూడా స్థలం లేక దొంగచాటున చెరువు గట్టులపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముస్లిం శ్మశానవాటిక ఆక్రమణకు గురైంది. ఎన్నిసార్లు అధికారులు వినతులు పంపించినా పట్టించుకోవటంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. డంపింగ్‌యార్డు లేక స్టేట్‌హైవే పక్కనే చెత్తా చెదారాలు వేసి కాల్చుతున్నారు. గురుబట్లగూడెం రోడ్లో మంచినీటిబోరు వద్ద చికె న్ వ్యర్ధాలు వేయటం వలన దుర్వాసన వెదజల్లుతోంది. స్టేట్ హైవేతో సహా.. అంతర్గత రహదారులైన గంగారం-రామానగరం, గంగారం-గురుభట్లగూడెం, ప్రకాష్‌నగర్‌కాలనీ - రామగోవిందాపురం రోడ్ల పక్కన డ్రైయినేజీలు లేక పోవటం రోడ్లపై తిరిగే పరిస్థితి నెలకొంది. గంగారం-గురుభట్లగూడెం జంక్షన్ వద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు నిలిచి ప్రజలపై పడుతోంది. ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో ఇళ్లు మంజూరులో జరిగిన అక్రమాలతో చాలా మంది నిరుపేదలకు పక్కా గృహాలు వచ్చే పరిస్థితి లేదు. సత్వరం విచారణ పూర్తి చేసే అర్హులైన లబ్ధిదారులకు పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. సాయంత్రం వేళ్లల్లో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో బస్‌స్టాప్ సెంటర్లో రద్దీ నెలకొంటోంది. ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈవ్‌టీజింగ్ అరికట్టాలని, మోటారు సైకిళ్ల వేగ నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆటో స్టాండ్ లేకపోవటం వలన రోడ్డుపక్కనే నిలిపాల్సి రావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా.. : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్నా.. సంసద్ ఆదర్శ కార్యక్రమంలో భాగంగా గంగారం గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా. జిల్లా యంత్రాంగం, మంత్రులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాను. ప్రధాన మంత్రి నరేంద్రమోడి మెచ్చుకునే వవిధంగగా గంగారం గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ చాలా అదృష్టంగా భావిస్తున్నా.. : ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దతత్త తీసుకోవటంతో చాలా అదృష్టంగా భావిస్తున్నా.. గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధివైపు పరుగులు పెడుతుంది. అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించేందుకు ననా వంతు ప్రయత్నం చేస్తా. -కోటమర్తి రమేష్, సర్పంచ్, గంగారం