ఈ సారి మహేశ్‌బాబుతో వస్తా
ప్రజావసరాల ప్రాతిపదికగా అభివృద్ధి
మహేశ్‌బాబు దత్తత గ్రామంపై నమ్రతా శిరోడ్కర్
తెనాలి: ప్రజల అవసరాలను తెలుసుకుని, వాటి ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం అభివృద్ధిని చేపడతామని, అప్పుడే ఎంత మొత్తంలో తమ నిధులు కేటాయించేదీ వెల్లడిస్తామని సినీహీరో మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ చెప్పారు. తొలి ప్రాధాన్యతగా ఆరోగ్య ఉప కేంద్రం టేకప్ చేస్తామన్నారు. మహేశ్‌బాబు త్వరలోనే బుర్రిపాలెం సందర్శిస్తారని తెలిపారు. సినీహీరో కృష్ణ స్వస్థలం అయిన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని ఆయన కుమారుడు మహేశ్‌బాబు దత్తత తీసుకున్న విషయం విదితమే. గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు నమ్రతా శిరోడ్కర్.. మహేశ్ సోదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య పద్మావతితో కలసి గురువారం బుర్రిపాలెంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలో చేపట్టాల్సిన పనులను మహేశ్‌బాబు, ఎంపీ జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజా నిర్ణయిస్తారని చెప్పారు.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి..: గ్రామంలో బహిరంగ మలవిసర్జనను మాన్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్నది స్మార్ట్ విలేజ్‌లో భాగమని గుర్తుచేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకూ కొన్ని అవసరాలున్నాయని, ప్రతి విద్యార్థి సౌకర్యవంతంగా పాఠశాలకు వచ్చి ఆనందంగా పాఠాలు నేర్చుకునేలా చూడాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. వివిధ పద్దుల నుంచి గ్రామానికి ఇప్పటికే రూ.1.20 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, టీడీపీ నేతలు, గల్లా యూత్ ఫోర్స్ యువకులు పాల్గొన్నారు.