ప్రతి గెజిటెడ్ అధికారి ఒక గ్రామం దత్తత
టీజీవో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
హన్మకొండ: ప్రతి గెజిటెడ్ అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. సోమవారం హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల 2017 డైరీ, క్యాలెండర్‌ను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలితో కలసి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న గ్రామం, డివిజన్‌లో నెలలో కనీసం రెండు రోజులు పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడం, సంబంధిత అధికారులతో మాట్లాడి అమలయ్యేలా చూడటం, సామాజిక అసమానతలు రూపుమాపడం, సామాజిక రుగ్మతలు తొలగించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వరంగల్ నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.