మనసున్న మా'రాజు' | ayodhya lanka village Adopted Ranganatha Raju | Sakshi
Sakshi News home page

మనసున్న మా'రాజు'

Published Sun, Jun 24 2018 8:18 AM | Last Updated on Sun, Jun 24 2018 8:18 AM

ayodhya lanka village Adopted Ranganatha Raju - Sakshi

ఆచంట: దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోక సమస్యలతో సతమతమవుతున్న ఆచంట మండలం అయోధ్యలంక వాసులకు మంచిరోజులొచ్చాయి. లంక గ్రామస్తుల సమస్యలు స్వయంగా పరిశీలించిన ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. లంక గ్రామంలో పర్యటించిన ఆయన అయోధ్యలంకను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రజలకు వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని గ్రామాల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి అయోధ్యలంకకు  పడవపై ప్రయాణించారు.

ఈ సందర్భంగా లంక వాసులు తమ ఇబ్బందులు రంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా లంక గ్రామం చుట్టూ గోదావరి ఉన్నా తాగడానికి మంచీనీరు అందక పడుతున్న ఇబ్బందులు వెల్లడించారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఆయన గ్రామంలో సొంత నిధులతో వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి సురక్షితమైన మంచినీరు ఓ ఆటోలో ఇంటింటికీ పంపిస్తానని హామీ ఇవ్వడంతో లంక గ్రామ వాసుల ఆనందానికి అవధులు లేవు. ఆయన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే సొంత ఖర్చులతో తీరుస్తానని హామీ ఇచ్చారు.

విద్యా వలంటీర్ల ఏర్పాటు
అయోధ్యలంకలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు కుంటుపడుతున్నాయని గ్రామస్తులు చెప్పడంతో  ఆయా నాలుగు పాఠశాలల్లో నలుగురు విద్యా వలంటీర్లను నియమిస్తానని రంగనాథరాజు చెప్పారు. ఇదేవిధంగా లంక గ్రామంలో తరచూ పాముల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలుపగా గ్రామంలోని డిస్పెన్సరీలో ఫ్రిజ్‌ ఏర్పాటు చేసి అందులో పాముకాటు మందు అందుబాటులో ఉంచుతామని, వైద్య సిబ్బందిని నియమిస్తానని చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే తన సొంత నిధులతో పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. 

వారధి నిర్మాణానికి కృషి..
అయోధ్యలంక వాసులు గ్రామం చేరుకోవాలంటే పడవ ప్రయాణమే దిక్కు. ఏళ్ల తరబడి అయోధ్యలంక–పుచ్చల్లంక గ్రామాల మధ్య వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అయితే లంకలో పర్యటించిన రంగనాథరాజు తమ పార్టీ అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే విధంగా గ్రామంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఆయన ప్రకటించిన నవరత్నాల పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతాయన్నారు. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రంగనాథరాజు హామీలతో అయోధ్యలంక వాసులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  పర్యటనలో మండల పార్టీ అధ్యక్షుడు ముప్పాల వెంకటేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్,  గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, ఎంపీటీసీ పెచ్చెట్టి సత్యనారాయణ, పార్టీ నాయకులు  గొల్లపల్లి బాలకృష్ణ, యన్నాబత్తుల ఆనంద్, చెల్లెం వరప్రసాదు, మానుకొండ సత్యనారాయణ, రొక్కాల వెంకటేశ్వరరావు, సరెళ్ల రాజు, వడ్లమూడి శ్రీనివాసరావు, గొల్ల సురేష్, కాంపాటి రాజు, మాజీ ఎంపీటీసీ గొర్రె వెంకటనారాయణ, మడిమెట్ల రాంబాబు, కామన హరిబాబు, వస్కా ఉమేష్, నెక్కంటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన  వైఎస్సార్‌సీపీ నాయకుడు వడ్లమూడి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement