వృద్ధునిపై ఎస్‌ఐ దాడి
► ఖండిస్తూ ప్రజల రాస్తారోకో
► పరస్పరం ఫిర్యాదులు
చింతామణి(కర్నాటక): ప్రజలను కాపాడాల్సిన పోలీసే వృద్ధుడని కూడా చూడకుండా దాడికి తెగబడ్డాడు. చిన్న విషయానికే దౌర్జన్యం చేయడంతో వృద్ధుని సంబంధీకులు రాస్తారోకో చేసిన సంఘటన గురువారం పట్టణంలో చేలూరు సర్కిల్‌లో జరిగింది. బాధితులు తెలిపినమేరకు వినోబకాలనికి చెందిన నారాయణప్ప, కుమారుడు శంకర్ బైక్ మీద సర్కిల్ దాటుతుండగా విధి నిర్వహణలో కానిస్టేబుల్ క్రిష్ణప్ప వారిని అడ్డగించి విచారిస్తుండగా, పట్టణ క్రైం పీఎస్‌ఐ నరసింహమూర్తి అక్కడికి వచ్చారు. ఆయనతో వృద్ధుడు నారాయణప్ప మధ్య మాటామాట పెరగడంతో పీఎస్‌ఐ నరసింహమూర్తి, నారాయణప్పను దూషిస్తూ పక్కకు తోసేయడంతో కిందపడ్డాడు.
వృద్ధుడు అస్వస్థతకు గురికావడంతో శంకర్ తన తండ్రిని చింతామణి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకొన్న వారి కుటుంబీకులు, స్థానికులు పీఎస్‌ఐ దాడిని ఖండిస్తూ ఒక గంట పాటు చేలూరు సర్కల్‌లో తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
ఈ విషయం తెలుసుకొన్న పట్టణ డీఎస్పీ కృష్ణమూర్తి ఆందోళనకారులతో చర్చించి ఎవరు తప్పు చేసివుంటే వారిపై చర్యలు తీసుకొంటామని, ఆందోళన విరమించాలని నచ్చజెప్పారు. పీఎస్‌ఐ నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని నారాయణప్ప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన విధులకు ఆటంకం కలిగించారని నారాయణప్పపై పీఎస్‌ఐ ఫిర్యాదు చేశారు.