సిద్ధి వినాయకునికి ‘ఉగ్ర’ ముప్పు
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్‌లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఒక బృందం ముంబైలో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదివరకే సిద్ధివినాయక మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉంది. తాజా హెచ్చరికల మేరకు మరింత ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్ధివినాయక మందిరంతోపాటు నక్షత్రాల హోటళ్లలో బసచేసిన విదేశీ పర్యాటకులకు మరింత భద్రత కల్పించారు.
నగరంలో అక్కడక్కడ నాకాబందీలు ప్రారంభించారు. గతంలో జరిగిన 26/11 సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరానికి వచ్చే అన్ని రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారు.