సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ మహాలక్ష్మీ ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ మందిరానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఆలయ నిర్వాహకులు పూర్తిచేశారు. ఇప్పటికే ఈ మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంవల్ల నగర పోలీసు శాఖ బందోబస్తు మరింత పటిష్టం చేసింది. సాధారణ రోజుల్లో ఈ మందిరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతుంది.
నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంఖ్య పది రెట్లకుపైనే ఉంటుంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా మందిరం, ఆలయ పరిసరాల్లో దృష్టి సారించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచారు. బందోబస్తులో భాగంగా 1,200 మంది పోలీసులు, హోం గార్డులు, భద్రతాదళాలు, వివిధ స్వయంసేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మందిరానికి రంగులు వేయడంతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చన, హోం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే మందిరానికి వచ్చే భక్తులు తమ వెంట పూజా సామగ్రి మినహా బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తీసుకురావద్దని ఆలయ యాజమాన్యం వి/ప్తి చేసింది.
భక్తులు క్యూలో నిలబడేందుకు క్యాడ్‌బరి జంక్షన్ వరకు మండపం ఏర్పాటు చేశారు. అందులో తాగునీరు, పాదరక్షలు ఉచితంగా భద్రపర్చుకునేందుకు రెండు స్టాండ్లు అందుబాటులో ఉంచారు. మందిరం ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులు కనిపించినా వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, హోం గార్డుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
భక్తులకు మార్గదర్శనం చేసేందుకు మందిరం బయట భులాభాయి దేశాయి రోడ్డుపై ప్రత్యేకంగా ఒక మండపం ఏర్పాటు చేశారు. అందులో విధులు నిర్వహించే సిబ్బంది మహాలక్ష్మి రైల్వే స్టేషన్‌కు ఎలా వెళ్లాలి...? బెస్ట్ బస్టాపులు ఎక్కడున్నాయి...? దర్శనానికి ఎక్కడి నుంచి క్యూ కట్టాలి...? తదితర అంశాలపై భక్తులకు మార్గదర్శనం చేస్తారు.
మహాలక్ష్మి మందిరానికి భద్రత పెంపు
Published Tue, Sep 23 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement
Advertisement