మహాలక్ష్మి ఆలయానికి భారీ భద్రత | Tight security at Mahalakshmi temples | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి ఆలయానికి భారీ భద్రత

Published Wed, Oct 2 2013 12:21 AM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM

Tight security at Mahalakshmi temples

సాక్షి, ముంబై: నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని నగరంలోని  మహాలక్ష్మి ఆలయంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగుతాయి. దీంతో నిత్యం లక్షలాది మంది భక్తులు బంగారు మహాలక్ష్మిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
 
 భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన ఏర్పాట్లను స్థానిక గావ్‌దేవి పోలీసులు చూసుకుంటారని ఆలయ కమిటీ పదాధికారి శరద్‌చంద్ర పాధ్యే చెప్పారు. ‘సముద్ర తీరానికి అనుకొని ఉన్న ఈ ఆలయం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉత్సవాల సమయంలో భక్తులు, ఆలయానికి మరింత భద్రత కల్పించాల్సి వస్తుంద’ని ఆయన అన్నారు.  ఏర్పాట్లలో భాగంగా మందిరం ఆవరణ మొదలుకుని హాజీ అలీ జంక్షన్, క్యాడ్‌బరీ జంక్షన్ వరకు 50 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. లలితా పంచమి, అష్టమి, సెలవు రోజుల్లో ఆలయానికి దాదాపు రెండు లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చే అవకాముంది. వీరి సౌకర్యార్థం మందిరాన్ని ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. గావ్‌దేవి పోలీసులు, కానిస్టేబుళ్లు, స్టేట్ రిజర్వ్డ్ పోలీసులు, బీఎంసీకి చెందిన 25 మంది భద్రతా సిబ్బంది, హోంగార్డులు భద్రత విధులను పర్యవేక్షిస్తారన్నారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. మందిరం బయట అందుబాటులో ఉంచనున్న అంబులెన్స్‌లో వైద్య బృందం ఉంటుందని చెప్పారు.
 
 ఆలయానికి వచ్చే భక్తులు పూజా సాహిత్యం మినహా ఇతర వస్తువులు వెంట తేకూడదని పాధ్యే చెప్పారు. ప్లాస్టిక్ సంచులు, పెద్ద బ్యాగులు వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. క్యూలో నిలబడిన భక్తులు ఎండ, వర్షం నుంచి తట్టుకునేందుకు క్యాడ్‌బరీ జంక్షన్ వరకు టెంట్లు, మండపం ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, ఉచితంగా చెప్పులు భద్రపర్చే స్టాండ్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ‘నవరాత్రుల్లో తొలిరోజైన శనివారం ఉదయం 5.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 హారతి, హవనం కార్యక్రమాలుంటాయి. ఆఖరి రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్ణాహుతి అనంతరం అర్చన, హారతి ఇచ్చి విజయదశమి వేడుకలు నిర్వహిస్తామ’ని పాధ్యే పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement