సాక్షి, ముంబై: ఆరతి క్రీడా మండలి ఆధ్వర్యంలో వర్లిలో శనివారం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బీడీడీచాల్స్‌లో మండపం ఏర్పా టు చేసి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా దాండియా రాజ్, భజనలు, పిల్లలకు డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, అలాగే మహిళల కోసం పసుపు కుంకుమ కార్యక్రమం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఏడు గంటలకు 56 రకాల వంటకాలతో అమ్మ వారికి నైవేద్యం సమర్పించి, మహా హారతి ఇస్తారు.
అదేవిధం గా 11న సాయంత్రం నాలుగు గంటలకు హవనం, శ్రీ సత్యనారాయణ మహాపూజ, అతిథులకు సన్మా నం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12న అన్నదానం, 13న దసరా స్నేహసమ్మేళనం, దేవి నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని మండలి ప్రతి నిధి శ్రీనివాస్ జక్కని వివరించారు. తొమ్మిది రోజు ల పాటు జరుపుకునే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
షోలాపూర్‌లో
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్‌లో శనివారందేవీ నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహాలను 423 మండపాలలో ప్రతిష్ఠించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టణవాసులు తమ ఆరాధ్య దైవంగా భావించే రూపాభవానీ మాత ఆలయంలో వేకువజామునే వివిధ ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవి దర్శనం కోసం భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు.
నేడు సభ
భివండీ, న్యూస్‌లైన్: అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి హాలులో ఆదివారం సభ జరగనుంది. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో స్థానికులు తగు సూచనలు అందించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందువల్ల స్థానికులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అఖిల పద్మశాలి సమాజ్ కార్యదర్శి దాసి అంబాదాస్ కోరారు. ఈ నెల 12న సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు.
సప్తశృంగి ఆలయానికి అదనపు బస్సులు
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం నాసిక్‌కు 60 కిలోమీటర్ల దూరంలోగల సప్తశృంగి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ) శనివారం నుంచి 300 అదనపు బస్సులను నడుపుతోంది. ఇవి రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల నుంచి బయల్దేరతాయి. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి పాటిల్ తెలియజేశారు.