Mahalakshmi temple
-
బిడ్డతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. తమ కుమార్తె క్లీంకారతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (ఇది చదవండి: పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!) ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. (ఇది చదవండి: బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?) -
కరుణించవమ్మా మహాలక్ష్మి..
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్‌కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. -
వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం
నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్ కోదండరామపురంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం లక్ష్మీకుబేరస్వామి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్ పత్తి నరసింహం మాట్లాడారు. దేవస్థాన 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా అమ్మవారికి విశేషపూజలు, అభిషేకాలను నిర్వహించామని చెప్పారు. ఆలయ ప్రధానార్చకుడు నాగరాజుశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉభయకర్తలుగా కాటేపల్లి వెంకటరమణయ్య, సరిత దంపతులు వ్యవహరించారు. దేవస్థాన పాలకమండలి సభ్యులు వాసిపల్లి నారాయణరెడ్డి, దామెర చంద్రమౌళి, నూకతోటి వెంకటేశ్వర్లు, గోవిందరాజు, పత్తి శ్రీనివాసులు, ఎర్ర వెంకటసుబ్బానాయుడు, తదితరులు పర్యవేక్షించారు. -
మహాలక్ష్మి మందిరానికి భద్రత పెంపు
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ మహాలక్ష్మీ ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ మందిరానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఆలయ నిర్వాహకులు పూర్తిచేశారు. ఇప్పటికే ఈ మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంవల్ల నగర పోలీసు శాఖ బందోబస్తు మరింత పటిష్టం చేసింది. సాధారణ రోజుల్లో ఈ మందిరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంఖ్య పది రెట్లకుపైనే ఉంటుంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా మందిరం, ఆలయ పరిసరాల్లో దృష్టి సారించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచారు. బందోబస్తులో భాగంగా 1,200 మంది పోలీసులు, హోం గార్డులు, భద్రతాదళాలు, వివిధ స్వయంసేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మందిరానికి రంగులు వేయడంతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చన, హోం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే మందిరానికి వచ్చే భక్తులు తమ వెంట పూజా సామగ్రి మినహా బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తీసుకురావద్దని ఆలయ యాజమాన్యం వి/ప్తి చేసింది. భక్తులు క్యూలో నిలబడేందుకు క్యాడ్బరి జంక్షన్ వరకు మండపం ఏర్పాటు చేశారు. అందులో తాగునీరు, పాదరక్షలు ఉచితంగా భద్రపర్చుకునేందుకు రెండు స్టాండ్లు అందుబాటులో ఉంచారు. మందిరం ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులు కనిపించినా వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, హోం గార్డుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు మందిరం బయట భులాభాయి దేశాయి రోడ్డుపై ప్రత్యేకంగా ఒక మండపం ఏర్పాటు చేశారు. అందులో విధులు నిర్వహించే సిబ్బంది మహాలక్ష్మి రైల్వే స్టేషన్‌కు ఎలా వెళ్లాలి...? బెస్ట్ బస్టాపులు ఎక్కడున్నాయి...? దర్శనానికి ఎక్కడి నుంచి క్యూ కట్టాలి...? తదితర అంశాలపై భక్తులకు మార్గదర్శనం చేస్తారు. -
మహాలక్ష్మి ఆలయానికి భారీ భద్రత
సాక్షి, ముంబై: నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని నగరంలోని మహాలక్ష్మి ఆలయంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగుతాయి. దీంతో నిత్యం లక్షలాది మంది భక్తులు బంగారు మహాలక్ష్మిని దర్శించుకునేందుకు వస్తుంటారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన ఏర్పాట్లను స్థానిక గావ్‌దేవి పోలీసులు చూసుకుంటారని ఆలయ కమిటీ పదాధికారి శరద్చంద్ర పాధ్యే చెప్పారు. ‘సముద్ర తీరానికి అనుకొని ఉన్న ఈ ఆలయం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉత్సవాల సమయంలో భక్తులు, ఆలయానికి మరింత భద్రత కల్పించాల్సి వస్తుంద’ని ఆయన అన్నారు. ఏర్పాట్లలో భాగంగా మందిరం ఆవరణ మొదలుకుని హాజీ అలీ జంక్షన్, క్యాడ్బరీ జంక్షన్ వరకు 50 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. లలితా పంచమి, అష్టమి, సెలవు రోజుల్లో ఆలయానికి దాదాపు రెండు లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చే అవకాముంది. వీరి సౌకర్యార్థం మందిరాన్ని ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. గావ్‌దేవి పోలీసులు, కానిస్టేబుళ్లు, స్టేట్ రిజర్వ్డ్ పోలీసులు, బీఎంసీకి చెందిన 25 మంది భద్రతా సిబ్బంది, హోంగార్డులు భద్రత విధులను పర్యవేక్షిస్తారన్నారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. మందిరం బయట అందుబాటులో ఉంచనున్న అంబులెన్స్‌లో వైద్య బృందం ఉంటుందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు పూజా సాహిత్యం మినహా ఇతర వస్తువులు వెంట తేకూడదని పాధ్యే చెప్పారు. ప్లాస్టిక్ సంచులు, పెద్ద బ్యాగులు వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. క్యూలో నిలబడిన భక్తులు ఎండ, వర్షం నుంచి తట్టుకునేందుకు క్యాడ్బరీ జంక్షన్ వరకు టెంట్లు, మండపం ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, ఉచితంగా చెప్పులు భద్రపర్చే స్టాండ్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ‘నవరాత్రుల్లో తొలిరోజైన శనివారం ఉదయం 5.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 హారతి, హవనం కార్యక్రమాలుంటాయి. ఆఖరి రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్ణాహుతి అనంతరం అర్చన, హారతి ఇచ్చి విజయదశమి వేడుకలు నిర్వహిస్తామ’ని పాధ్యే పేర్కొన్నారు.