
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం
భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
ఘట్‌కేసర్: భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజీజ్, సనా భార్యాభర్తలు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్, అన్నోజిగూడలో వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అజీజ్ ఇన్ఫోసిస్ సాప్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 4 న భార్యాభర్తలు ఏదో విషయమై గొడవపడ్డారు.
దీంతో అజిజ్ తన సెల్‌ఫోన్, వాలెట్ తీసుకోకుండానే మనస్తాపంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు అజీజ్ ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందుతున్న ఆయన భార్య సనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజీజ్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.