పుణే: హిందూ రాష్ట్ర సేనకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంజనీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనకు కారకులగా భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే... షోలాపూర్‌కు చెందిన షేక్ మొహసిన్ సాదిఖ్ పుణేలోని హడప్సర్‌లో ఉంటూ స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు బ్యాంకర్ కాలనీలో సాదిఖ్‌పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన అతణ్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సాదిఖ్ మరణించాడు.
అతనిపై దాడికి పాల్పడిన ఏడుగురు హిందూ రాష్ట్ర సేనకు చెందినవారని, వారిని అరెస్టు చేసి భారత శిక్షాస్మృతి, సెక్షన్ 302, 307, 147 ప్రకారం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరాఠా ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేను అవమానించేలా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదివారం బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఈ హత్య జరగడంతో సాదిఖ్ పోస్ట్ చేసి ఉంటాడనే అనుమానంతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని, ప్రజలు సంయమనంతో ఉండాలని పోలీసులు కోరారు.
ఇదిలా ఉండగా ఈ దాడిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. కులాన్ని లక్ష్యంగా చేసుకొని ఇలా దాడులు చేయడం సిగ్గుచేటైన విషయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి శశిథరూర్ విమర్శించారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన ఈ అభ్యంతరకర చిత్రాలు, వ్యాఖ్యలపై గత నాలుగైదు రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పలు హిందూ సంస్థలు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రశాంతంగా జరిగినప్పటికీ సోమవారం ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటన లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను కూడా సంయమం పాటించాలని ప్రచార మాధ్యమాల ద్వారా కోరుతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య
Published Wed, Jun 4 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement