సాక్షి, అమరావతి : కొడుకు కోసం ఆతల్లి పేగు తపించిపోతోంది. ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం వెళ్లి కనిపించకుండా పోయిన కుమారుడి కోసం ఆ తండ్రి ఎదురుచూడని రోజు లేదు. తన బిడ్డ ఆచూకీ కోసం తొక్కని గుడిలేదు, కలవని ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు లేడు. చివరకు మీరే దిక్కంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆశ్రయించారు.
వివరాల్లోకి విజయవాడ, నున్న గ్రామానికి చెందిన గుదిబండి లక్ష్మారెడ్డి, పార్వతి భవానీ దంపతుల కుమారుడు శ్రీహర్షారెడ్డి(28) ఉద్యోగం కోసం 2016లో పూణె వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అయితే గత ఏడాది ఆగస్టు 6నుంచి ఫోన్ చేయడం లేదు. అనుమానం వచ్చిన పూణెకు వెళ్లి విచారించగా అదృశ్యం అయినట్లు గుర్తించారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు హర్ష కోసం గాలింపు చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును సైతం కలిసి తమ బిడ్డ ఆచూకీ కోసం సాయం చేయమంటూ అర్థించారు. అయినా ఫలితం లేకపోయింది.
తాజాగా శ్రీహర్ష తల్లిదండ్రులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో కలిశారు. తమ బిడ్డ చూసి 18 నెలలైందంటూ విలపించారు. శ్రీహర్షారెడ్డి ఆచూకీ కోసం సాయం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. వారి ఆవేదనను విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్ర సీఎం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment