
ఆ ఎమ్మెల్యేలపై ‘వేటు’ వాయిదా
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయాన్ని ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేక్కేందుకే తమపై కుట్రపూరితంగా వేటు వేస్తున్నారని కోర్టులో దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రాగా ఈ కేసు 20వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆరోజున కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది చేసిన సూచన మేరకు స్పీకర్ వెనక్కుతగ్గారు.
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో కుట్రపూరితంగా నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, తాము మరలా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శుక్రవారం చెన్నైలో వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి ఆదేశాలు పొంది త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు.
ఎడపాడి ప్రభుత్వాన్ని వచ్చేవారం కూల్చివేయడం ఖాయమని డీఎంకేతో కూటమి లేకుండానే ఎడపాడిని సాగనంపుతామని పేర్కొన్నారు. ఇక మైసూరులోని రిసార్టులో ఉన్న దినకరన్‌వర్గ ఎమ్మెల్యేలకు తమిళనాడు పోలీసుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.