చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి | Special focus on the Chain Snatcher | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి

Published Fri, May 23 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

నగరంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు క్రైం బ్రాంచి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరాలు చేసేందుకు నేరస్తులు అనుసరిస్తున్న మార్గంలోనే వారిని నియంత్రించాలని వ్యూహం పన్నారు.

 దక్షిణ ఢిల్లీ డీసీపీ జైస్వాల్
 
న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు క్రైం బ్రాంచి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరాలు చేసేందుకు నేరస్తులు అనుసరిస్తున్న మార్గంలోనే వారిని నియంత్రించాలని వ్యూహం పన్నారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. పోలీసుల వ్యూహం ఫలించింది. దక్షిణ ఢిల్లీలో సుమారు 50కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన గౌరవ్ చిక్నా(24) అనే స్నాచర్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. అతడి వద్ద ఒక తుపాకీ, రూ. 8 లక్షల విలువచేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణ) బి.ఎస్.జైస్వాల్ మాట్లాడుతూ దక్షిణ ఢిల్లీలో పలుచోట్ల చైన్ స్నాచింగ్ కేసుల నమోదు ఎక్కువయ్యాయన్నారు.నిందితులు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారు తేరుకునేలోపే మెడల్లోని చైన్‌లను లాక్కుపోతున్నారన్నారు. చాలా కేసుల్లో దొంగలు ద్విచక్రవాహనాలపై రోడ్డుకు రాంగ్ సైడ్‌లో వచ్చి ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. రాంగ్‌సైడ్‌లో వస్తే దొంగతనం చేసిన తర్వాత సులభంగా తప్పించుకు పారిపోవచ్చని వారి ఆలోచన అన్నారు. దీంతో, దొంగల వ్యూహాలను పరిశీలించిన తర్వాత తాము కూడా అదే మార్గంలో పయనించి, దొంగలను అరెస్టు చేయాలని నిర్ణయించామన్నారు.
 
ఈ మేరకు 30 బృందాలను ఏర్పాటుచేశామని, వారికి అతివేగంగా వెళ్లే మోటార్‌సైకిళ్లను అందజేశామన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు పోలీసులు ఉంటారని, వారికి ఆయుధాలు, వైర్‌లెస్ సెట్లు అందజేశామన్నారు. వీరు బిజీ రోడ్లలో సాధారణ పౌరులుగా తిరుగాడుతూ రోడ్డుపై వెళుతున్న మహిళలపై నిఘా పెడతారన్నారు. ఎట్టకేలకు తమ వ్యూహం ఫలించిందని డీసీపీ తెలిపారు. ఎన్‌హెచ్-8కు సమీపంలోని శంకర్ విహార్ ప్రాంతంలో మహిళ మెడలో చైన్ తెంపుకుపోయేందుకు ద్విచక్రవాహనంపై నుంచి దిగిన గౌరవ్ చిక్నాను తమ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు.
 
అతడివద్ద బుల్లెట్లతో నిండి ఉన్న పిస్టల్, బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసుల ఉనికిని గ్రహించిన రెండో దొంగ జావెద్ బైక్‌పై తప్పించుకు పారిపోయాడని తెలిపారు. నిందితుడిని పోలీసుల పద్ధతిలో విచారించగా జెరెరాకు చెందిన సుమారు 8 మంది సభ్యులున్న బడా గౌరవ్ గ్యాంగ్‌లో తాను కూడా సభ్యుడినని చిక్నా చెప్పాడన్నారు.
 
పలు చైన్ స్నాచింగ్, దొంగతనాలు, హత్య కేసుల్లో నిందితుడైన బడా గౌరవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దీంతో గ్యాంగ్ బాధ్యతలను తాను తీసుకున్నట్టు చిక్నా చెప్పాడని డీసీపీ వివరించారు. గ్యాంగ్ సభ్యులందరూ దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ ప్రాంతాల్లో పలు చోట్ల చైన్ దొంగతనాలకు పాల్పడుతుంటారని, కొట్టేసిన దాంట్లో కొంత భాగం తమ నాయకుడు బడా గౌరవ్‌కు అందజేస్తారని వివరించాడన్నారు. కాగా, ముఠాలోని మిగిలిన సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటామని జైస్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement