సాక్షి, జనగామ జిల్లా: పాప వయస్సు ఏడాది.. అయినా బోర్లా పడరాదు..చేతులతో ముందుకు కదలలేదు.. ఆస్పత్రులకు వెళితే బాగయ్యే పరిస్థితి లేదన్నారు.. ఒకవైపు మూడేళ్ల కొడుక్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, చిన్నారి పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురైన కన్న తల్లే చిన్నబిడ్డను నీటి సంప్‌లో వేసి చంపేసింది. ‘అయ్యో దొంగోడొచ్చాడు.. నా మెడలో పుస్తెల తాడు లాక్కోబోయాడు.. అడ్డుకున్నందుకు చంటి పాపను సంపులో వేసి చంపేశాడంటూ దొంగేడుపుతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు జైలు పాలయింది. అప్పటివరకు తన కూతురును ఎత్తుకుని ఆడించిన తండ్రి.. హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లిన అరగంటకే ఫోన్‌లో ఆమె మరణ వార్త తెలియడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
కొడుక్కి ఓపెన్ హార్ట్.. కూతురు కదల్లేని స్థితి
జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన నడిగోటి భాస్కర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా పొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల నవనీత్, తేజస్వి (12 నెలలు) ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నడిపించే భాస్కర్, బతుకు దెరువు కోసం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు మకాం మార్చాడు. అనారోగ్యానికి గురైన నవనీత్‌కు ఇటీవలే ఓపెన్ హార్టు సర్జరీ చేయించగా, రూ.8 లక్షల వరకు ఖర్చయింది. తేజస్వి కూడా సరైన ఎదుగుదల లేక సరిగ్గా కదలలేని స్థితిలో ఉండేది. దీంతో అనేక ఆస్పత్రులకు తిప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా, బాగయ్యే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రసన్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది.
కూతురు హత్యకు ముందే ప్లాన్
సోమవారం వీరితోనే ఉంటున్న అత్త, మామ, మరిది వేరే ఊరికి వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు భాస్కర్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లగా, ప్రసన్న ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండి పోయింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట నీటి సంప్‌లో పడేసింది. చనిపోయిన తర్వాత బయటకు తీసి అరుపులు, కేకలతో ఏడుపు మొదలుపెట్టింది. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రావడంతో అతనికి చైన్ స్నాచింగ్ కథ విని్పంచింది. అతనితో కలిసి బైక్‌పై ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌కు తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి ఉంచి ఆమెతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
‘గోడ మీదుగా హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మెడలోని పుస్తెల తాడు బ్లేడ్‌తో తెగ్గొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులకు, చుట్టుపక్కల వారికి ప్రసన్న చెప్పుకొచి్చంది. తాను అతనితో పెనులాడడానని, దుండగుడు రెండు ముక్కలైన పుస్తెల తాడు తీసుకుని, మరో వైపు పసిపాపను లాక్కుని, ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వేసి, గోడ దూకి పారిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అక్కడ ప్రసన్న చెబుతున్నట్టుగా సీన్ కనిపించకపోవడంతో అనుమానించిన ఏసీపీ జి.క్రిష్ణ, సీఐ ఇ.శ్రీనివాస్ భార్యాభర్తలను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు. తానే పాపను హత్య చేసినట్లు ఆమె నోటితోనే చెప్పించారు. ఆ మేరకు భర్త ఇచి్చన ఫిర్యాదుతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని జైలుకు పంపించారు.
తల్లి డ్రామా బట్టబయలైయింది : డీసీపీ
ఈ కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. కూతురును హత్య చేసి, చైన్‌స్నాచర్ చేతిలో హతమైనట్లుగా నమ్మించేందుకు ప్రయతి్నంచిన తల్లి నిజాన్ని ఒప్పుకుందని డీసీపీ పి.సీతారాం విలేకరులకు తెలిపారు. పాప అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతోనే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరిచిందని తెలిపారు. బతికినంత కాలం కూతురితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే చైన్ స్నాచింగ్ డ్రామా చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment