‘ప్రత్యేక’ విధానాలు అమలు చేయండి
ప్రత్యేక ప్రతిభావంతులతో వ్యవహరించాల్సిన విధి విధానాల్ని త్వరితగతిన రూపొందించి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల గడువును ఇస్తూ, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
సాక్షి, చెన్నై:అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వంటి అంగ వైకల్యం కలిగిన వారందరినీ ప్రత్యేక ప్రతిభావంతులుగా పరిగణిస్తున్నారు. ఇటీవల వీరు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షల రూపంలో తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తూ ఇక్కట్లకు గురవుతున్నారు. ఆందోళనలు చేసే క్రమంలో వీరిని పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. నెల న్నర క్రితం చెన్నైలో రోజుకో చోట చొప్పున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించిన ప్రత్యేక ప్రతిభావంతులపై పోలీసులు కన్నెర్ర చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కల్గించే రీతిలో వ్యవహరిస్తున్న ఈ ప్రత్యేక ప్రతిభావంతుల్ని అరెస్టు చేసి, నగర శివారులో వదిలిపెట్టి వచ్చారు. అయితే, చూపు లేని వాళ్లు, నడవ లేని వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వ్యవ హారం తన దృష్టికి రావడంతో న్యాయవాది నజీరుల్లా మద్రాసు హైకోర్టుకు ఓ లేఖ రాశారు. పోలీసుల చర్యలతో ప్రత్యేక ప్రతిభావంతులు పడ్డ అష్టకష్టాలను వివరించారు. ఆయన లేఖను పిటిషన్‌గా భావించిన హైకోర్టు కేసు విచారణకు ఆదేశించింది. వికలాంగుల్ని అరెస్టు చేసే క్రమంలో వారితో ఎలా వ్యవహరించాలో అన్న అంశంపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అమల్లో విధి విధానాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని మొదటి బెంచ్ ముందు గురువారం కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరుపున కొన్ని విధానాల్ని రూపొందించి బెంచ్ ముందు ఉంచారు. అయితే, ఆ విధానాల అమలు కేవలం చెన్నైకు పరిమితం చేశారంటూ వికలాంగుల సంఘాలు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న బెంచ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రతిభావంతులు తమ డిమాండ్లు, హక్కుల సాధన కోసం ఆందోళనలకు దిగిన పక్షంలో, వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలోకి తరలించడం కన్నా, వారి చిరునామా తదితర వివరాల్ని సేకరించి సమీపంలోని బస్టాండ్‌కు తీసుకెళ్లి బస్సు ఎక్కించి పంపించాలని సూచించారు. మరికొన్ని విధి విధానాలను త్వరితగతిన రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులతో సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసి, డిమాండ్లను, హక్కుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే రీతిలో ఆ కమిటీలకు మార్గదర్శకాల్ని నిర్దేశించాలని సూచించారు. నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో విధి విధానాల్ని రూపొందించి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమలు చేసిన విధి విధానాల్ని పిటిషన్ రూపంలో కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.