సాక్షి, చెన్నై: తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా జరుగుతున్న నిరసన, ఆందోళన హింసాత్మకంగా మారడంపై కోర్టు గురువారం స్పందించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. వివాదాస్పద పారిశ్రామిక యూనిట్ ప్రతిపాదిత విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లోని మదురై బెంచ్ ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణానికి ప్రజల అనుమతి పొందాలని తెలిపింది. ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు తాజా పిటిషన్ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది.
మరోవైపు తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. కాగా వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర నాయకులు పోలీసుల దమనకాండపై మండిపడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment