సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి పట్టణం రక్తసిక్తమైంది. వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. పోలీసులు సహా 60 మంది గాయపడ్డారు. వాణిజ్య సముదాయాలు, వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు రణ రంగాన్ని తలపించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పొరుగు జిల్లాలు మదురై, విరుధ్‌నగర్ నుంచి పోలీసులను హుటాహుటిన తూత్తుకుడికి రప్పించారు.
ప్రజలంతా సంయమనం పాటించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి అభిప్రాయాలు, ఆకాంక్షలను గౌరవించి సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మంత్రులు, డీజీపీతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి పళనిస్వామి వేదాంత కంపెనీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు.
లాఠీచార్జి ప్రయోగం ఫలించకనే...
వేదాంత వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తూత్తుకుడిలో 144వ సెక్షన్ విధించారు. ఉదయం ఓ చర్చి వద్ద సమావేశమైన ఆందోళనకారులు తొలుత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కలెక్టరేట్ వరకు మార్చ్ నిర్వహించారు. వందలాది మంది మహిళలు కూడా తమ చంటిబిడ్డలను చంకనవేసుకుని ఆందోళనలో పాల్గొన్నారు.ఇంతలో తోపులాటలతో మొదలైన ఘర్షణలు క్షణాల్లోనే ఉధృతమయ్యాయి.
కలెక్టరేట్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోయింది. కొందరు నిరసనకారులు లోనికి ప్రవేశించి ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. బయట ఉన్న ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాల విండ్‌స్క్రీన్లను బద్దలుకొట్టి, బ్యాంకు కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారు. లాఠీచార్జి, బాష్ప వాయువు ప్రయోగంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
తాము శాంతియుతంగా నిరసన చేస్తూ, ఎలాంటి కవ్వింపునకు పాల్పడకపోయినా పోలీసులు కాల్పులు జరిపారని ఆందోళనకారులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు. 20 వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డి. జయకుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది.
ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం
11 మంది కాల్పుల్లో మరణించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ అధీనంలోని ఉగ్రవాదంతో సమానమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న నిరసనకారులపై కాల్పులు జరపడం గర్హనీయమని అన్నారు. ప్రాణనష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
వ్యతిరేకత ఎందుకు?
పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment