తూత్తుకుడిలో పోలీసు కాల్పుల్లో మరణించిన వ్యక్తి(తాజా చిత్రం)
తూత్తుకుడి: దక్షిణ తమిళనాడులోని తీరపట్టణం తూత్తుకుడిలో మళ్లీ హింస చెలరేగింది. పట్టణంలోని అన్నానగర్ ప్రాంతంలో బుధవారం బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపగా ఒకరు చనిపోయారు. మరో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. తోటి ఆందోళనకారులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటల్లోపే మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో నిరసనకారులు తీవ్రఆగ్రహంతో రగిలిపోతున్నారు.
తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనోద్యమం మంగళవారంనాడు ఒక్కసారిగా హింసాయుతమలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 11 మంది ఆందోళనకారులు చనిపోయారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ అఖిలపక్షం బుధవారం తుత్తూకుడి బంద్‌కు పిలుపిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది.
వ్యతిరేకత ఎందుకు?
మానవాభివృద్ధి సూచిలో చెన్నైనగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న తూత్తుకుడి పట్టణంలో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment