
టైలర్ రమేష్ ,ఆక్సిజన్ తీసుకొంటూ పనిలో నిమగ్నం
సాఫీగా సాగిపోతున్న జీవితంలో కల్లోలం ఎదురైంది. అది కకావికలం చేసేసింది. కులాసాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మంచపట్టాడు. అయ్యో ఎందుకిలా జరిగింది అని రోజుల తరబడి ఆవేదనతో కుమిలిపోయాడు. అంతలోనే ఆయనలోని సంకల్పం ఓటమిని అంగీకరించనివ్వలేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశాడు. చక్రాల కుర్చీనుంచే పెద్ద కుటుంబానికి అండగా నిలిచాడు.
గౌరిబిదనూరు: గౌరిబిదనూరు పట్టణంలో ఉండే టైలర్ రమేష్‌ను చూస్తే ఎవరైనా పెద్ద ఆఫీసరేమో అనుకుంటారు. ఒకప్పుడు ఆయన అలాగే ఉండేవారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారారు. అనారోగ్యంతో జీవితం చీకటిమయమైనా చలించలేదు. అంగ వైకల్యం పీడిస్తున్నా శ్రమనే నమ్ముకుని సాగుతున్నారు. 53 సంవత్సరాల రమేష్ బి.కాం. డిగ్రీ పూర్తీ చేశారు. హిందీలో విశారద పాసయ్యారు. చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ)లో 3 సంవత్సరాల శిక్షణ పొందారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని సూపర్ స్పిన్నింగ్ మిల్లులో గోడౌన్ ఇన్‌చార్జ్‌గా ఉద్యోగం చేసేవారు. 1992లో... ఆయనకు 27 ఏళ్ల వయసులో విధి చిన్నచూపు చూసింది. వెన్నపూసకు అంతుతెలియన జబ్బు సోకింది, నడుము కింది భాగం స్పర్శ లేకుండా పోయింది. కాళ్లలో కదలిక శూన్యమైంది. కూర్చోవడం, లేవడం కూడా చేతనయ్యేది కాదు. మంచమే నేస్తమైంది. నాన్ కంప్రెసివ్ మైలోపతి విత్ ప్యారాప్లీగియా అనే నరాల జబ్బుతో కలిపి మొత్తం 8 నాడీ జబ్బులు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇవి నయం కాదని, చికిత్స లేదంటూ వైద్యులు సైతం చేతులెత్తేశారు.
టైలరింగ్‌పై దృష్టి
దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పుడే రమేష్‌లో పట్టుదల, దీక్ష, సంకల్పంగా మారింది. తన తండ్రితో పాటు 4 తరాలుగా కుటుంబపోషణకు జీవనాధారమైన టైలరింగ్‌పై మమకారం కలిగింది. మంచం మీద నుంచే టైలరింగ్‌కు శ్రీకారం చుట్టారు. గుడ్డలను కొలతలకు తగినట్లు కత్తిరించడంలో నైపుణ్యం పొందారు. అంతలోనే కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి మరణం మరో పిడుగుపాటు మాదిరిగా తాకింది. కుటుంబం ఆకలి తీర్చడం తనపై పడింది. రోజుకు 14 గంటలపాటు కూర్చొని గుడ్డలు కత్తిరిస్తూ ఉంటారు. ఆ గుడ్డలను వేరే టైలర్లు షర్టులుగా కుడితే రమేష్ వాటికి కాజాలు వేసి ఇస్త్రీ చేసి సిద్ధం చేస్తారు. ఇలా సుమారు 20 మంది టైలర్లకు ఆయనే గుడ్డలు పంపి షర్టులు, ఫ్యాంట్లు కుట్టిస్తారు. పాఠశాలల యూనిఫారంలు ఆర్డర్లు తీసుకొని గుడ్డలను కత్తిరించి టైలర్లకు కుట్టడానికి ఇస్తూన్నారు. దీనితో నెలకు రూ. 6–7 వేల వరకు ఆదాయం వస్తూ ఉంది.
ఆక్సిజన్ తీసుకొంటూ పనిలో నిమగ్నం :అదొక్కటే సమస్య కాదు
రమేష్ చికిత్స కోసం 15 రోజుల కొకసారి బెంగుళూరుకు వెళ్లి రావడం తప్పనిసరి. ఈ మధ్యలో తన రెండు ఊపిరితిత్తుల్లో ఒకటి పని చేయడం మానేసింది.రాత్రి వేళల్లో, చలికాలంలో ఆక్సిజన్ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. అయినా రమేష్ వెనుకంజ వేయరు. ఇంట్లోని తన తల్లి, సోదరిలు, వారి పిల్లలు అంతా 8 మంది పోషణ ఆయనపైనే ఉంది. ఆక్సిజన్‌కే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. రమేష్ పెళ్లి చేసుకోలేదు. వీల్ చైర్ సహాయంతో తిరుగుతూ ఉంటారు. ఆయన శ్రమను గుర్తించి ప్రభుత్వం తాలూకా స్థాయిలో రాజ్యోత్సవ ప్రశస్తి, కన్నడ సాహిత్య పరిషత్తు ప్రశస్తిలను బహూకరించడం విశేషం.

బట్టలను కటింగ్ చేస్తున్న రమేశ్
Comments
Please login to add a commentAdd a comment