
అమ్మ విజయమే
చెన్నై: నటిగా, పురట్చితలైవిగా, అమ్మగా, తమిళనాట సంచనాలకు మారు పేరుగా, గత చరిత్రను తిరగరాసిన ఘనత అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలితకే దక్కుతుంది. నిర్ణయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీసుకోవడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, ఉపసంహరించుకునే రీతిలో కన్నెర్ర చేసినా రాజకీయంగా ఆమె రూటే సెపరేటు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చేసిన సాహసం, తీసుకున్న నిర్ణయం మళ్లీ అధికార పీఠాన్ని దగ్గరకు చేర్చింది. మరి కాసేపట్లో ఆరోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో సీఎం జయలలిత జీవిత గమనం, సంచనాలు, ప్రత్యేక శైలి గురించి ఓ మారు గుర్తుకు తెచ్చుకుందాం.
బాల్యం:
1948 ఫిబ్రవరి 24న మైసూర్‌లో తమిళ అయ్యంగార్ సంతతికి చెందిన జయరామన్, పాత తరం నటి సంధ్య దంపతులకు జయలలిత జన్మించారు. రెండేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆమె, తదనంతరం తల్లితోపాటుగా స్వస్థలం తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని చర్చ్‌పార్క్ స్కూలులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు స్కూల్ టాపర్‌గా నిలిచారు. ఉన్నత చదువు మీద కన్నా, తల్లిబాటలో సినీ రంగంలో అడుగు పెట్టేందుకు మక్కువ చూపించారు.
సినీ రంగం:
కథక్, భరతనాట్యం, మోహినీఆట్టం, మణిపురి వంటి నాట్యాలలో ప్రా వీణ్యురాలైన జయలలిత వెన్నిరాడై చిత్రంతో చిత్ర సీమలో అడుగు పెట్టారు. త దుపరి సినీ వినీలాకాశంలో తారగా వెలుగొందారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించారు. అత్యధికంగా దివంగత మాజీ ముఖ్యమం త్రి ఎంజీఆర్‌తో కలసి ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఏ రంగంలోనైనా సరే, తన ప్రత్యేకతను చాటుకునే జయలలిత పది పాటలను సైతం ఆలపిం చడం మరో విశేషం. తొలిసారిగా, అడిమైపెన్ చిత్రంలో అమ్మా ఎండ్రాల్.. అనే చరణంతో మొదలయ్యే పాట ఆలపించగా.. ఈ పాటలోని తొలి అక్షరం. ఇప్పుడు అందరి నోట జయలలితను అమ్మ...అమ్మ అని పిలిపిస్తున్నది.
రాజకీయ పయనం:
కరుణానిధితో ఏర్పడ్డ విభేదాల కారణంగా డీఎంకేను వీడి వేరు కుంపటి పెట్టిన దివంగత ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)తో ఉన్న సన్నిహితం జయలలిత చూపును రాజకీయాల వైపుగా మరల్చాయి. ఎంజీఆర్ అడుగుజాడల్లో 1981లో అన్నాడీఎంకేలో అడుగు పెట్టిన జయలలిత వెనుదిరిగి చూసుకోలేదు. పార్టీలో చేరగానే, కార్యదర్శి పదవిని దక్కించుకుని, తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జయలలితలోని ధైర్యసాహసాలను గుర్తించిన ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభకు పంపించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆకర్షించే దిశగా జయలలిత ప్రసంగం రాజ్యసభలో సాగిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో కీలకంగా మారిన జయలలిత రాజకీయ గురువుగా భావించే ఎంజీఆర్ మరణంతో సమస్యల్ని, ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.
ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ సీఎంగా తెర మీదకు రావడంతో వెన్నంటి ఉన్న నాయకులంతా జయలలితను దాదాపుగా ఒంటరిని చేశారు. అదే సమయంలో జానకీ రామచంద్రన్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం కావడం జయలలితకు కలిసి వచ్చిన అంశం. తదుపరి ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం పతనం కావడం, తనతో పాటుగా పలువురు మాత్రమే అసెంబ్లీ మెట్లు ఎక్కడం జయలలిత హోదాను ఎక్కడికో తీసుకెళ్లింది. దేశంలోనే తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయలలిత అవతరించారు. ప్రజా సమస్యలపై ఆమె సాగించిన సమరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు దోహదకారిగా మారింది. 1991లో జరిగిన ఎన్నికలతో తొలిసారిగా ముఖ్యమంత్రి పగ్గాల్ని చేపట్టారు.
వివాదాల గండం:
రాజకీయ పయనంలో దూసుకొస్తున్న సమయంలో జయలలితను పలు వి వాదాలు చుట్టుముట్టాయి. ఇందులో అవినీతి, అక్రమ ఆస్తులు వంటి కేసుల్లో జ యలలిత పేరు చేరడం సంచలనమే. టాన్సీ భూముల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడం, తదుపరి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడడం వంటి పరిణామాలతో దేశంలో జైలు శిక్షల్ని ఎదుర్కొన్న సీఎంగా మరో సంచలన వార్తల్లోకి ఎక్కారు. రెండు సార్లు సీఎం పదవిని కోల్పోయి, కేసుల్ని ఎదుర్కొని మళ్లీ పగ్గాలు చేపట్టడంలో జయలలితకు సరి లేరెవ్వరు. ఈ రెండుసార్లు తన నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.
పథకాలు:
వివాదాలు చుట్టిముట్టినా, జైలుకు వెళ్లొచ్చినా ప్రజా హితాన్ని కాంక్షించే పథకాల్ని ప్రవేశ పెట్టడంలో జయలలిత దిట్ట. గతంలో ఆమె ప్రవేశ పెట్టిన ఉయ్యాల బేబి పథకం నుంచి నేటి అమ్మ పథకాలన్నీ ప్రజాకర్షణ మంత్రాలే. ఇక రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్లకు పెద్ద పీట వేసిన ఘనతఆమెకే దక్కుతుంది. పేదల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పెట్టిన అమ్మ పథకాలు ప్రస్తుతం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో ఆమెకు కలిసి వచ్చిన అంశం. అధికార పగ్గాలు చేపట్టినప్పుడల్లా మహిళా సాధికారత ధ్యేయంగా ఆమె ప్రవేశ పెట్టే పథకాలు మరో ప్రత్యేకత. అందుకే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా మంత్రాన్ని జపించి మార్కుల్నే కొట్టేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతోనే తన పొత్తు అన్నట్టుగా ముందుకు సాగిన అమ్మకు అన్నీ విజయాలే.
వ్యక్తిగతం:
ప్రజలే తనకు జీవితం...ప్రజలే తన కుటుంబంగా భావించే జయలలిత పూర్తిగా శాఖాహారాన్ని ఇష్టపడతారు. తల్లి సంధ్య రాజకీయ గురువు ఎంజీఆర్, తన స్కూల్ హెడ్‌మాస్టర్- టీచర్, భరతనాట్య గురువు అంటే ఎంతో ఇష్టం. అలాగే, న్యాయశాస్త్రం అంటే మక్కువ. పుస్తకాలు అంటే మరెంతో ఇష్టం. అందుకే తన ఇంట్లో ఆమె పెద్ద గ్రంథాలయాన్ని కూడా పెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ఇక, ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ. అలాగే, బద్ధవిరోధి కరుణానిధి. కాగా, జయలలితకు దైవభక్తి ఎక్కువే. మంచి ముహూర్తం చూడందే ఏ పని తలబెట్టరు. ఆలయాల్లో అన్నదానాలు చేయించడం ఎంతో ఇష్టం. అందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో అన్నదాన పథకం అమల్లో ఉన్నదని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఏనుగులు అంటే అమిత ప్రేమ. తాను ఏదేని ఆలయానికి వెళ్లినా అక్కడ ఓ గున్నఏనుగును బహుకరిస్తుంటారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రతి ఏటా ఏనుగుల కోసం పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యేగా:
1989లో తేని జిల్లా బోడినాయకనూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1991లో బర్గూర్, కాంగేయంల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కి సీఎం పగ్గాలు చేపట్టారు. 1996లో బర్గూర్ ఓటర్లు కన్నెర్ర చేయడంతో ఓటమి చవిచూశారు. 2001 ఎన్నికల్లో ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, అరుప్పుకోటైల నుంచి నామినేషన్లు దాఖలు చేసినా, టాన్సీ కేసు చుట్టుముట్టడంతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ కేసు నుంచి బయటకు వచ్చినానంతరం 2002, 2006లలో ఆండిపట్టి నుంచి వరుసగా గెలిచారు. 2011లో తన మకాంను తిరుచ్చి జిల్లా శ్రీరంగంకు మార్చుకున్నారు. ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కినా, అక్రమాస్తుల కేసులతో అర్హతను కోల్పోయారు. ఈ కేసు నుంచి బయటకు వచ్చినానంతరం ఆర్కే నగర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుని రెండుసార్లు విజయ కేతనం ఎగుర వేశారు.