• కావేరి బోర్డు కోసం స్టాలిన్ నిరాహారదీక్ష
• కేంద్రంపై విమర్శలు
• వైగో ఆందోళన
సాక్షి ప్రతినిధి, చెన్నై :కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం తంజావూరులో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు.
తమిళనాడు, కర్ణాటక మధ్య ప్రవహిస్తున్న కావేరీ జలాల వినియోగంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కావేరీ పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ప్రకటించడంతో బోర్డు ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని అనేక పార్టీలు, రైతు సంఘాలు కొన్ని రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కావేరీ పర్యవేక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేని పరిస్థితి, కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాడుతోందని విమర్శించారు. బోర్డు ఏర్పాటుకు మోకాలొడ్డడం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమిళనాడుకు చేసిన పెద్ద ద్రోహమని ఆయన అన్నారు.
కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై ప్రధాని సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జయలలితపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి లేదా ఆ తరువాత ప్రాధాన్యత కలిగిన మంత్రిని ప్రశ్నించాలని చెప్పారు. ప్రతిపక్ష నేతలుగా తమ అభిపాయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని, ఇందులో భాగంగానే నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలనేది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అధికార పార్టీ జోక్యం ఉండకూడదని మాత్రమే తాము కోరుకున్నామని చెప్పారు. స్టాలిన్ దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎండీఎంకే ఆందోళన : ఇలా ఉండగా, కావేరీ అంశంపై ఎండీఎంకే అధినేత వైగో నేతృత్వంలో శుక్రవారం తిరువారూరులో భారీ ఆందోళన చేపట్టారు. కర్నాటకకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రైతులను బాధిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కావేడి
Published Sat, Oct 8 2016 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement