• భిన్న ధ్రువాల భేటీ
• మంత్రి పన్నీరు సెల్వంతో స్టాలిన్
• కావేరీపై అఖిలపక్షానికి విజ్ఞప్తి
• కావేరీ కోసం సహకరిస్తా:
• గవర్నర్ హామీ
తమిళనాడు రాజకీయాల్లో బలమైన భిన్న ధ్రువాలు భేటీ అయ్యాయి. రాజకీయ విభేదాలతో కత్తులు దూసుకునే ఇద్దరు అగ్రనేతలు కావేరీపై చర్చించుకున్నారు. వారిద్దరూ ఎవరో కాదు మంత్రి పన్నీర్ సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్. -సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో ప్రధానంగా రెండు విషయాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం. మరొకటి కావేరీ జలవివాదం. కావేరీ వివాదం దశాబ్దాల తరబడి నానుతుండగా, జయ అనారోగ్యానికి జరుగుతున్న చికిత్స నెలరోజులకు చేరుకుంటోంది. ఈ రెండు అంశాలు ప్రస్తావనకు రాకుండా పొద్దుపొడవడం లేదు, పొద్దుగుంకడం లేదు అంటే అతిశయోక్తి కాదు. కాగా, కావేరీ సమస్యపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేపనిలో పడ్డాయి. డీఎంకే కార్యాలయంలో గురువారం నాడు స్టాలిన్ అధ్యక్షతన వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాలు సమావేశమయ్యారు. కావేరీ జల వివాదంపై నిర్ణయాలు తీసుకునే బాధ్యతను స్టాలిన్‌కు ఏకగ్రీవంగా కట్టబెట్టాయి. కావేరీ పోరాటంపై స్టాలిన్ వెంటే నడుస్తామని ప్రకటించాయి.
ఇందులో భాగంగా డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. స్టాలిన్ సచివాలయానికి రావడం సహజమే కాబట్టి సాధారణంగానే పరిగణించారు. అయితే ప్రతిపక్ష నేత కావడంతో మీడియా ఆయన్ను అనుసరించింది. స్టాలిన్ తన కార్యాలయానికి వెళతారు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన నేరుగా మంత్రి పన్నీర్‌సెల్వం చాంబర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వారి వద్ద సమాచారం ఉందేమో అక్కడి అధికారులు స్టాలిన్‌ను హడావుడిగా పన్నీర్‌సెల్వం చాంబర్‌లో పంపి తలుపు వేశారు. సుమారు అరగంటకు పైగా మంత్రి పన్నీర్‌సెల్వంతో సమావేశమైన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
కావేరీ అంశంలో ప్రజలు సైతం ఏకతాటిపై నిలిచి ఉన్నారని కేంద్రానికి తెలియజేయాలి. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం ధిక్కరించడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఖండించే విధంగా వెంటనే అన్ని పార్టీల అధ్యక్షులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అన్నదాత జీవనాధారాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి. అలాగే అత్యవసర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కావేరీపై తీర్మానాన్ని ఆమోదించాలని డీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పన్నీర్ సెల్వం ముందు ఉంచినట్లు స్టాలిన్ తెలిపారు. సమావేశంలో చేసిన తీర్మానాల ప్రతిని అందజేశానని అన్నారు.
మంత్రి పన్నీర్ సెల్వంకు తీర్మానాల ప్రతిని ఇచ్చినందువల్ల ఫలితం ఉంటుందని నమ్ముతున్నారా అని మీడియా ప్రశ్నించగా, నమ్మకం ఉన్నందునే ప్రతిని ఇచ్చానని బదులిచ్చారు. కావేరీ అంశం కోర్టులో ఉందని తమిళనాడు ప్రభుత్వం దాటవేస్తోంది కదా అని ప్రశ్నించగా, అది వేరు, ఇది వేరు, కర్ణాటక ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాన్ని ఎలా ప్రజల ముందు ఉంచిందో తమిళనాడు ప్రభుత్వం కూడా అదే పోకడలో పయనించాలని ఆయన అన్నారు. అఖిలపక్ష నేతలతో ప్రధానిని కలిసేఁఊందుకు ప్రభుత్వం పూనుకోవాలని మంత్రి పన్నీర్ సెల్వంను కోరినట్లు తెలిపారు.
అఖిలపక్షం అవసరం లేదు: బన్రుట్టి
కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి బన్రుట్టి రామచంద్రన్ అన్నారు. ఈనెల 18వ తేదీన కావేరీపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనున్న తరుణంలో స్టాలిన్ కోరుతున్నట్లుగా అఖిల పక్ష సమావేశం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కావేరీకి సహకరిస్తా: గవర్నర్ విద్యాసాగర్ రావుకావేరీ జల వివాదాన్ని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చారు.
తంజావూరులోని ఆలయాన్ని గురువారం సతీసమేతంగా సందర్శించారు. చెన్నై తమిళ్ సంఘం ఆధ్వర్యంలో తంజావూరు తమిళ్ యూనివర్సిటీలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆహూతులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న కావేరీ సమస్య పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.
కావేరీ..కలిపింది!
Published Sat, Oct 15 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement
Advertisement