కూల్చేస్తాం!
► స్టాలిన్ హెచ్చరిక
► లండన్ నుంచి చెన్నైకి రాక
► ఆ ఇద్దరు మంచి నటులు
► పళని, పన్నీరుకు చురక
అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చేస్తామని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఆ ఇద్దరు మంచి నటులు అని పళని, పన్నీరులకు చురకలు అంటించారు. లండన్ నుంచి ఆదివారం స్టాలిన్ చెన్నైకి చేరుకున్నారు.
సాక్షి, చెన్నై: జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగానే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆయన ప్రకటించడం గమనించాల్సిన విషయం. గత వారం లండన్‌కు వెళ్లిన స్టాలిన్ ఆదివారం వేకువజామున రెండున్నర గంటలకు చెన్నైకి చేరుకున్నారు. మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
మంచి నటులు
ఢిల్లీ వేదికగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సాగుతుందని విమర్శించారు. ఈ దర్శకత్వానికి తగ్గట్టుగా ఓపీఎస్, ఈపీఎస్ చక్కటి వేషధారణతో నటనలో రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కట్ట పంచాయితీ సాగించిన విషయం మరో స్పష్టమైనట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి, విలీనం విషయంగానే ఎక్కువ సమయాన్ని సీఎం కేటాయిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని ధ్వజమెత్తారు. జయలలిత నివాసాన్ని చట్టవిరుద్ధంగా స్మారక మందిరంగా ప్రకటించారని ఆరోపించారు.
తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ఎలాంటి చట్టపూర్వక నిర్ణయాలు తీసుకున్నారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. జయలలిత మరణంలో అనుమానం ఉందని తనతో పాటు ప్రతి పక్షాలన్నీ సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయన్నారు. జయలలిత సమాధి వద్ద కూర్చుని, ఆమె ఆత్మ తనతో మాట్లాడినట్టుగా పన్నీరు పలుకులు ఆ రోజున ఉన్నాయని గుర్తుచేశారు. సీబీఐ విచారణ జరగాలని ఆయన కూడా డిమాండ్ చేశారని, అయితే, రిటైర్డ్ జడ్జితో విచారణకు ఎలా..? అంగీకరిస్తారని ప్రశ్నించారు. జయలలిత మరణంలో ఉన్న మిస్టరీని నీరుగార్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
పాలకుల ఇష్టారాజ్యం
తమ స్వలాభంకోసం పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలు సాగిస్తుంటే, వారిని బెదిరించడం అణగదొక్కే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ ఈ బెదిరింపులు ఇవ్వడాన్ని బట్టి, ఏమేరకు పాలన ఇక్కడ సాగుతుందో స్పష్టం అవుతుందని విమర్శించారు. తమిళనాడును రక్షించుకోవడం లక్ష్యంగా, అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా ఉద్యోగులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుందని వ్యాఖ్యానించి ముందుకు సాగారు.