విడాకులపై మనసు మార్చుకున్న హీరో
బెంగళూరు : ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కుటుంబ కలహాలు పరిష్కరించుకుని భార్య ప్రియా రాధాకృష్ణన్ తో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. కుటుంబ కలహాలతో కోర్టు మెట్లు ఎక్కిన సుదీప్, ప్రియ ఇద్దరూ తమ విభేదలు మరచిపోయి కలిసుండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ విషయంలో సుదీప్ అభిమానుల్లో సంతోషం నెలకొంది.
సుదీప్...భార్య ప్రియతో విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసినప్పటి నుంచి అతడు న్యాయస్థానానికి హాజరు కాలేదు. గతంలో కూడా రెండు నెలల సమయం కావాలని కోర్టుకు సుదీప్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.
కాగా సుదీప్, ప్రియ 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలరీత్యా విడిపోయేందుకు వీరిద్దరూ న్యాయస్థానం ఆశ్రయించారు. అంతేకాకుండా భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ సిద్ధపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో సుదీప్, ప్రియ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.