సూర్యః 43.7 డిగ్రీలు
- నగరంలో మండుతున్న ఎండలు
- రోడ్లెక్కేందుకు జంకుతున్న జనం
సాక్షి, న్యూఢిల్లీ: నగరం ఎండ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిపోయింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. గురువారం పగటి ఉష్ణొగ్రత 43.7 డిగ్రీలు ఉండటంతో అన్ని వయసుల వారు వేడిని తట్టుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది. భానుడు భగ్గుమంటుండటంతో నగరం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
దాదాపు వారం రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో రెండు మూడు రోజులు చిరుజల్లులు కురిసినా ఎండలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇక నగరంలో గురువారం 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఉదయం పది గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
మళ్లీ సాయంత్రం తర్వాత రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. నగరంలో ఎండవేడి మరి కొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ విభాగం అంటోంది. శుక్ర, శని, ఆదివారాలలో ఆకాశం స్వల్పంగా మేఘావృతమెనప్పటికీ ఇప్పట్లో వర్షం పడే సూచనలు లేవని వాతావరణ విభాగం తెలిపింది.