న్యూఢిల్లీ: ముంబైలోని క్యాంపాకోలా భవనంలో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల్లో నివసిస్తున్నవారు వచ్చే ఏడాది మే 31వ తేదీలోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కనుగొనేందుకు నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ ఇవ్వలేమని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి విచారణ సందర్భంగా జస్టిస్ జి.ఎస్.సింఘ్వి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీచేసింది. అయితే అక్రమ అంతస్తుల్లో నివసించేవారికి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు శాశ్వత పరిష్కారం ఏదైనా సూచించాలని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి ఈ సందర్భంగా ధర్మాసనాన్ని కోరారు.
ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబ యజమానులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు సంబంధించి ఏదైనా ప్రతిపాదనను తమకు సమర్పించాలని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతికి సుప్రీంకోర్టు సూచించిన సంగతి విదితమే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, సిబ్బంది క్యాంపాకోలా భవనంలోని అక్రమ అంతస్తులను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. బాధితుల ఆక్రందనలను మీడియాలో గమనించి అదే రోజు సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సదరు ప్రక్రియపై స్టే ఇచ్చిన సంగతి విదితమే.
హౌసింగ్ బిల్లును ఆమోదించండి
ముంబై: గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభ్యర్థించారు. క్యాంపాకోలా భవన వివాదం నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఇటీవల రాష్ర్టపతికి ఈ మేరకు ఓ లేఖ రాశారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం ప్రతిపాదించిన మహారాష్ట్ర హౌసింగ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లును 2012లో రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని ఆ లేఖలో చవాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన లావాదేవీలు నిబద్ధతతో కూడుకున్నవిగా ఉండేలా చేసేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనలతోపాటు అభివృద్ధి నియంత్రణ (డీసీ) నియమాలను ఎవరూ ఉల్లంఘించకుండా చేసేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.
ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో క్యాంపాకోలా భవ నంలోని అక్రమ అంతస్తుల్లో నివసిస్తున్న బాధితులు ప్రత్యామ్నాయానికిగల అవకాశాలపై దృష్టి సారించారు. వారు తీర్పు ప్రతికోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై సదరు భవనంలో నివసిస్తున్న నందినీ మెహతా అనే బాధితురాలు మాట్లాడుతూ ఈ ఫ్లాట్లపై తాము ఆశలు వదిలేసుకున్నామన్నారు. ఏదో ఒక పరిష్కారం కోసం న్యాయనిపుణులను సంప్రదిస్తామన్నారు.