ఆనాటి సమావేశంలో వేదికపై ధ్యానముద్రలో విజయేంద్ర సరస్వతి స్వామి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక వివాదాలకు నిలయమైన కాంచీపురం మఠం చుట్టూ మరో వివాదం ముసురుకుంది. తమిళులు అత్యంత గౌరవంగా భావించే ‘తమిళ్‌తాయ్ వాళ్తు’(త మిళతల్లిని కీర్తిస్తూ ప్రార్దన)ను కాంచీపురం పీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అగౌరవపరిచారనే ఆరోపణలు రాష్ట్రంలో ఆందోళనలకు దారితీసాయి. స్వామిపై పోలీసులకు ఫిర్యాదు, తమిళులకు స్వామి క్షమాపణ చెప్పితీరాలనే డిమాండ్‌తో ప్రజలు, భాషాభిమాన సంఘాల వారు స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ గురువారం ఆందోళనలు నిర్వహించారు.
కాంచీపురం మఠం మేనేజర్ శంకరరామన్ హత్య, ఇందులో కిరాయి గూండాల ప్రేమయం, అందులో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి పాత్ర, చెన్నై మందవల్లిలోని ఒక వ్యక్తి ఇంటిపై కిరాయిగూండాల దాడి ఇలా అనేక వివాదాలు మఠాన్ని చుట్టుముట్టాయి. ఇద్దరు స్వాములను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకూడా పెట్టారు. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసులో స్వాములిద్దరూ నిర్దోషులుగా బైటపడ్డారు. ఇదిలా ఉండగా, తమిళుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా చోటుచేసుకున్న ఒక సంఘటన తాజా వివాదానికి కారణమైంది. అసలు విషయం ఏమిటంటే...బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా తండ్రి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 23వ తేదీ చెన్నైలో జరిగింది. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రులతోపాటూ విజయేంద్ర సరస్వతి స్వామి సైతం పాల్గొన్నారు. తమిళనాడు ఆనవాయితీ ప్రకారం నిర్వాహకులు సభా కార్యక్రమ ప్రారంభంలో తమిళ్‌తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు.
ఈ సమయంలో అందరూ లేచినిలబడగా స్వామి మాత్రం కళ్లుమూసుకుని కూర్చుండిపోయారు. ఆ తరువాత జనగణమణ జాతీయ గీతాన్ని ఆలపించినపుడు స్వామి లేచినిలబడ్డారు. దీంతో తమిళ్‌తాయ్ వాళ్తును స్వామి అవమానించారంటూ అదేరోజున విమర్శలు వచ్చాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కొందరు భాషాభిమానులు స్వామిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారగూడదన్న ఉద్దేశంతో శంకరమఠం నిర్వాహకులు బుధవారం వివరణ ఇచ్చారు. కార్యక్రమాల ప్రారంభంలో దైవప్రార్థ నాగీతాలను ఆలపించినపుడు స్వామి ధ్యానముద్రలో ఉండటం ఆనవాయితీఅని, జాతీయగీతం సమయంలో దేశభక్తికి కట్టుబడి స్వామి లేచి నిలుచున్నారని తెలిపారు. తమిళ్‌తాయ్ వాళ్తును సైతం దైవ ప్రార్థనగా స్వామి భావించడం వల్లనే ధాన్యంలో కూర్చుండిపోయారేగానీ తమిళతల్లిని కించపరిచే ఆలోచన కాదని వివరించారు.
అయితే ఈ వివరణకు శాంతించని ఆందోళనకారులు స్వామి క్షమాపణ చెప్పాల్సిందేనని గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనే జిల్లాల్లో పోరాటాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాంచీపురంలోని శంకరమఠంను పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలకు చెందిన మహిళలు ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మఠంలోకి జొరబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని సుమారు వంద మందిని అరెస్ట్ చేశారు. తమిళర్ దేశీయ మున్నని, తమిళర్‌నల పేరియక్కం, తమిళ్ పులిగళ్ తదితర పార్టీల వారు గురువారం ఉదయం 9.30 గంటలకు రామేశ్వరంలోని కంచికామకోటి శంకరమఠాన్ని ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మఠం నిర్వాహకులు ఆందోళనకారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయేంద్ర సరస్వతిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తంజావూరులోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. అలాగే కోయంబత్తూరులో పవర్ హౌస్ వద్ద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జాతీయగీతానికి లేచినిలబడిన స్వామి తమళ్‌తాయ్ వాళ్తుకు కూర్చునే ఉండిపోవడం తమిళనాడు ప్రభుత్వాన్ని, తమిళ భాషను అవమానించడమేనని విమర్శలు చేశారు. తమిళభాషను కంచి స్వామి అవమానించినందుకు మీ రక్తం ఉడికిపోవడం లేదా అంటూ ప్రముఖ సినీదర్శకులు భారతిరాజా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజలను ప్రశ్నించారు. ఈ గొడవలు ఇలా జరుగుతుండగానే జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు కంచిలోని వస్పీతనర్ మఠంలో కూర్చుని భక్తులను ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా కంచిస్వామికి వ్యతిరేకంగా పోరాటాలకు రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. కాంచీపురం మఠం వారు తమిళాన్ని కించపరిచే చర్యలకు ఎంతమాత్రం పాల్పడరని అన్నారు. కంచిమఠం వారు వివరణ ఇచ్చినా రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కంచి స్వామి చర్యలను రాష్ట్ర మంత్రులు సెల్లూరు రాజూ, పాండియరాజన్ సమర్థించగా కడంబూరు రాజా ఖండించారు. స్వామి పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా మరికొందరు పంతం పడుతున్నారు. దర్శకులు భారతిరాజా మరింత పరుషమైన వ్యాఖ్యలతో ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. అయితే స్వామి ఇంతవరకు నోరుమెదపలేదు. ఇంతకూ స్వామి క్షమాపణలు చెబుతారా లేకుంటే వివాదం ఎలా సమసిపోతుందనే ప్రశ్న తలెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment