మహోన్నతంగా ఎదగాలి | Symbiosis students in his should have something | Sakshi
Sakshi News home page

మహోన్నతంగా ఎదగాలి

Published Tue, Mar 4 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

Symbiosis students in his should have something

 పింప్రి, న్యూస్‌లైన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొద్దిసేపు ప్రొఫెసర్ అవతారమెత్తారు. పుణేలోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్ లెక్చర్ సిరీస్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులకు మంచిచెడులను వివరించారు. మనిషి జీవించి ఉన్నంత వరకు సంఘర్షణ తప్పదంటూ తన జీవిత అనుభవ పాఠాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ‘డబ్బు, పేరు, ప్రతిష్ట ప్రజల నుంచి లభిస్తాయి.

అయితే విద్య, శిక్షణ, జ్ఞానం మాత్రం ఎవరో ఇస్తే వచ్చేవి కావు. ఇవన్నీ కలిగిన వ్యక్తి మంచి దేశ పౌరుడు అవుతాడు. నేను చదువుకునే సమయంలో ఇటువంటి సదుపాయాలు లేనేలేవు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు సకల సదుపాయాలు వున్నాయి. వాటిని వినియోగించుకుని మహోన్నతమైన వ్యక్తిగా ఎదగాలి’ అని విద్యార్థులకు హితవు పలికారు. ‘ప్రతి ఒక్కరూ తనకాళ్లపై నిలబడడానికి ప్రయత్నించాలి. ఎవరిపైనా ఆధారపడకుండా జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి. అదే అందరినీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది’ అని మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా అమితాబ్ రెండు ఆలోచనాత్మకమైన కవితలను వినిపించారు.

 ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి శరవేగంగా జీవితంలో ఎదుగుతాడని అన్నారు. తన విద్యాభ్యాస దశలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. బాక్సింగ్‌ను చూడటం వేరు, ప్రత్యక్షంగా పాల్గొనడం వేరని, తాను ఈ నగరానికి కేవలం డ్రైవింగ్ లెసైన్సుతో వచ్చానన్నారు. నట జీవితంలో ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అందువల్లనే మంచి నటుడిగా నిలబడ్డానని అన్నారు. లేకపోతే ఓ మామూలు ట్యాక్సీ డ్రైవర్‌గా నిలబడిపోయేవాడినేమోనని అన్నారు. దేశానికి స్వాతంత్యం లభించిన సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలే తనకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కదా అని విజయోత్సవాలకే మనం పరిమితం కాకూడదని,  అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దినప్పుడే అసలైన విజయోత్సవం అని నెహ్రూ అన్నారని తెలిపారు. ఆ మాటలను మనందరం నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. ఏ పనినైనా పట్టుదలతో చేయాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రధాన సంచాలకులు డాక్టర్ యేరవడేకర్, వైస్ చాన ్సలర్ డాక్టర్ రజనీ గుప్తే, సింబయాసిస్ ఇంటర్నేషనల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సంచాలకులు చందన ఛటర్జీ, అనుపమ సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. అమితాబ్ ముందుగా ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆ తరువాత విద్యార్థులతో కలసి ఫొటోలకు పోజులిచ్చారు. అమితాబ్ రాకతో యూనివర్సిటీ బాగా సందడి సందడిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement