దానిపై నాకు నమ్మకం లేదు | taapsee pannu | Sakshi
Sakshi News home page

దానిపై నాకు నమ్మకం లేదు

Published Fri, Apr 24 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

taapsee pannu

మోడలింగ్‌లో నడకలు నేర్చి ఆపై సినిమాలో స్టెప్స్ వేయడం మొదలెట్టిన ఉత్తరాది బ్యూటీ తాప్సీ. హీరోయిన్‌గా కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఉరకలేస్తున్న పరువంతో పరుగులు పెడుతున్న ఈమె నటిగా ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నారు. అయితే అందం, అభినయాల్లో లోపం చెప్పడానికి వీలులేని తాప్సీ సినిమాలో అనుకున్న స్థాయికి చేరుకోలేదు. కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రమే (ఆడుగళం) జాతీయ అవార్డును గెలుచుకుంది. అయినా తాప్సీ కెరీర్ మెరుగుపడలేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ చాన్నాళ్ల తరువాత సంతోషంతో తుళ్లిపోతున్నారు. కారణం ఆమె నటించిన కాంచన -2 విశేష ప్రజాదరణు పొందడమే. ఈ చిత్రంలో తాప్సీ రెండు కోణాల్లో సాగే పాత్రను చాలా చక్కగా నటించారు. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్.
 
 ప్ర: కాంచన-2 చిత్రంలో దెయ్యంగా నటించిన అనుభవం గురించి?
 జ: చాలా కొత్త ఛాలెంజింగ్ అనుభవం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకుని నటించాను. లారెన్స్ ఎంతో నమ్మకంతో ఈ చిత్రంలో నేనే నటించాలని పట్టుబట్టి నటింప చేశారు. నా దెయ్యం నటన ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
 
 ప్ర: దెయ్యం అంటే భయం లేదా?

 జ: ఆ విషయం గురించి ఎందుకు అడుగుతారు లెండి. దెయ్యం అన్న మాట వింటేనే ఇప్పటికీ ఒంటిలో వణుకు పెడుతుంది. రాత్రుల్లో కూడా ఒంటరిగా నిద్రపోలేను. బామ్మనో, చెల్లెలు కూడా ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క దెయ్యం చిత్రం కూడా చూడలేదంటే నమ్మండి. చీకటి, నిశ్శబ్దం అన్నా భయమే.
 
 ప్ర: కాంచన-2 చిత్రంలో సిగరెట్లు తాగినట్లున్నారు?
 జ: చాలా దారుణమైన అనుభవం అది. నిజానికి నాకు సిగరెట్ అంటేనే అయిష్టత. షూటింగ్‌లో సిగరెట్ వెలిగించినప్పుడు ఆ పొగ కళ్లు, ముక్కుల్లోకి వెళ్లి చాలా అవస్థ పడ్డాను. ఆ సన్నివేశానికి 20 టేక్‌లు తీసుకున్నా. మరో విషయం ఏమిటంటే ఆ రోజంతా భోజనం కూడా చేయలేకపోయాను. ఇకపై జీవితంలో సిగరెట్ దరిదాపులకు వెళ్లను.
 
 ప్ర: సరే తదుపరి చిత్రం వై రాజా వై గురించి?
 జ: వై రాజా వై చిత్రంలో నాది అతిథి పాత్రే. అది జూదం నేపథ్యంలో సాగే కథా చిత్రం. ఆ జూదం గురించి ఇతరులకు నేర్పే పాత్ర నాది. హాస్యాస్పదం ఏమిటంటే పేకాట గురించి నాకు ఏ మాత్రం అవగాహన లేదు. ఐశ్వర్య ధనుష్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే నటించాను.
 
 ప్ర: చిత్రాల్లో మీడియా జర్నలిస్ట్‌గా నటించారు. నిజ జీవితంలో జర్నలిస్టుగా పని చేయాలనే  ఆసక్తి ఉందా?
 జ: అమ్మో నా వల్ల కాదు. మానసికంగా నలిగిపోయే వృత్తి అది. నిరంతరం టెన్షన్‌తో కూడిన పని. కొత్త కొత్తగా ఆలోచించాలి. అలాంటి వృత్తి నాకు ఖచ్చితంగా సెట్ అవ్వదు.
 
 ప్ర: నటి త్రిష వై దొలగిన పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారే?
 జ: ఆ విషయాలేవీ నాకు తెలియదు. కొత్త చిత్రం నటుడు జయ్ హీరో అన్నారు. కథ విన్నాను. నచ్చింది. నటించడానికి ఓకే చెప్పాను.
 
 ప్ర: నెంబర్ వన్ హీరోయిన్ ఆశ ఉందా?
 జ: అసలు నెంబర్ వన్ స్థానం పైనే నమ్మకం లేదు. త్వర త్వరగా పది చిత్రాలు చేసేసి పోటీ పడే మనస్థత్వం నాది కాదు. నా కంటూ ఆడియన్స్ ఉన్నారు. వారిని అలరించే విధంగా చాలా సెలెక్టివ్ చిత్రాలే చేస్తాను. హీరో పక్క బొమ్మ మాదిరి నిలబడే పాత్రలు, చెట్లు, పుట్టలు, చుట్టూ పాటలు పాడే పాత్రలు నచ్చవు.
 
 ప్ర: ఇద్దరు హీరోయిన్ల చిత్రాలే అధికంగా  చేస్తున్నారు?
 జ: నన్నేమి చేయమంటారు. 90 శాతం చిత్రాలిప్పుడు అలాంటివే వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు చిత్రాలు కలర్‌ఫుల్‌గా ఉండాలని ఆశిస్తున్నారు. అయినా సింగిల్ హీరోయిన్ పాత్ర వరిస్తే వద్దంటానా!
 
 ప్ర: హీరోలు సిఫార్సు చేస్తేనే హీరోయిన్లకు అవకాశాలన్న పరిస్థితిపై మీ అభిప్రాయం?
 జ: ఈ విషయంలో నిజం లేకపోలేదు. అయితే ఇప్పుడు హీరోల హవానే నడుస్తోంది. వారికే అధిక మార్కెట్ ఉం టుంది. హీరోయిన్ల కోసం ఎవరూ చిత్రాలు చూడటానికి రావడం లేదు. కాబట్టి తనకు ఏ హీరోయిన్ కావాలన్న విషయాన్ని హీరో నిర్ణయించడం తప్పు కాదు. నాకు అలాంటి సిఫార్సులు చేస్తే నేను చాలా చిత్రాలు చేసేదాన్ని.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement