చావో రేవో అన్నట్లుగా ఎన్నికల్లో తలపడిన రాజకీయపార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు సభ్యునిగా గెలవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుదామని కలలుకంటున్న నేతల తలరాతలు నేడు తేలిపోనున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం జరగనుంది. ఫలితాలపై పార్టీలతోపాటూ ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రెండేళ్ల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున రాష్ట్రంలో కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిం చారు. మొత్తం 39 లోక్‌సభ, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్నాడీ ఎంకే, డీఎంకే, బీజేపీ కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు బరిలోకి దిగాయి. అయితే ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ కూటముల మధ్య గట్టిపోటీ నెలకొంది. వామపక్షాలతో పొత్తుకు సిద్దమైన అన్నాడీఎంకే ఆతరువాత మనసు మార్చుకుని 40 స్థానాల్లోనూ ఒంటరిగా తలపడింది. చిన్నాచితకా ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకున్న డీఎంకే మిత్రపక్షాలకు 5 సీట్లిచ్చి 35 స్థానాల్లో పోటీకి దిగింది. ఈసారి అన్నాడీఎంకే, డీఎంకేలకు స్థానంలేని బలమైన కూటమిని బీజేపీ కూడగట్టగలిగింది. రాజకీయాల్లో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను అన్ని పార్టీలు కాలదన్నడంతో గత్యంతరం లేక ఒంటరిపోరుకు సిద్ధపడింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వైఖరితో భంగపడిన వామపక్షాలు స్వల్పస్థానాల్లో పోటీపడ్డాయి.
కోటలు దాటుతున్న ఆశలు
అత్యధిక స్థానాలను దక్కించుకోవడం ద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని జయలలిత ఆశపడుతున్నారు. ఇతర పార్టీల కంటే ఎక్కువ స్థానాలు రావడం వరకు ఖాయమని తెలుస్తోంది. ఒకవైపు మోడీ హవా, మరోవైపు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో బలమైన కూటమి తమకు అధిక స్థానాలు కట్టబెడుతుందని బీజేపీ ఆశిస్తోంది. వారి ఆశలు అడియాశలు కావడం ఖాయమని, తమదే ఆధిపత్యమని డీఎంకే చాటుకుంటోంది. ఒంటరిపోరు తమకు నూతనోత్తేజాన్ని ఇచ్చిందని, గణనీయమైన స్థానాలు ఖాయమని కాంగ్రెస్ బీరాలకు పోతోంది. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలు ఉంటాయని వామపక్షాలు ఎదురుచూస్తున్నాయి.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఆలందూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికపై శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. పుదుచ్చేరిలోని ఒక స్థానాన్ని అక్కడే లెక్కిస్తారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ వద్ద 323 నుంచి 420 మంది సాయుధ పోలీసులను బందోబస్తులో పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 62 మంది ఉన్నతాధికారులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల ద్వారా సాధారణ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలి రౌండ్ ఫలితాలను 10 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది.
లెక్కింపు కేంద్రాల్లో సెల్‌ఫోన్ నిషేధించారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందిన లెక్కింపు సూపర్‌వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బంది మాత్రమే ప్రవేశానికి అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లెక్కింపు కేంద్రాలకు వందమీటర్ల దూరంలోనే నిలిచిపోవాలని, లోనికి రాకూడదని ఆయన తెలిపారు. లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. విజేతలకు ధృవీకరణ పత్రాన్ని లెక్కింపు కేంద్రంలోనే అందజేస్తామని, విజేత వెంట కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై నిర్విరామంగా సాగుతుందని, సాయంత్రం 6 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెలువడుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరునెలల పాటూ ఈవీఎంలలో ఓట్ల వివరాలు భద్ర పరుస్తామని తెలిపారు. లెక్కింపు దృష్ట్యా శుక్రవారం పూర్తిగా టాస్మాక్ దుకాణాలు, బార్‌లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు.