
10 నుంచి అసెంబ్లీ
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమరం గురువారం నుంచి ఆరంభం కానుంది. 22 రోజుల పాటుగా సభ నిర్వహణకు అసెంబ్లీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. రోజుకు రెండు శాఖల చొప్పున నిధుల కేటాయింపులపై సమీక్ష జరగనున్నది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా నాలుగు రోజుల్లో సభను ముగించారు. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులు, అభివృద్ధి, చర్చకు ఆస్కారం ఇవ్వలేదు.
పస్తుతం ఎన్నికలు ముగియడంతో శాఖల వారీగా సమీక్షలకు అసెంబ్లీ సిద్ధం అయింది. గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశంలో అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, మౌళివాకం ఘటన, ధరల పెరుగుదల, శాంతి భద్రతల అంశాల్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు డీఎంకే, డీఎండీకే, పీఎంకే, సీపీఎం,సీపీఐ, కాంగ్రెస్‌లు సిద్ధమవుతున్నాయి. ప్రతి పక్షాల్ని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సైతం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై చర్చించేందుకు మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. 22 రోజులు : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ధనపాలన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అధికార పక్షం తరపున మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, ప్రభుత్వ విప్ మనోహర్, డీఎంకే తరపున చక్రపాణి, డీఎండీకే తరపున మోహన్ రాజ్, సీపీఎం తరపున సౌందరరాజన్, సీపీఐ తరపున ఆర్ముగం, కాంగ్రెస్ తరపున గోపినాథ్, ఎంఎంకే తరపున జవహరుల్లా,
పుదియ తమిళగం తరపున కృష్ణ స్వామి హాజరయ్యారు. గంటన్నర పాటుగా ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాల్ని సమీక్షించారు. తేదీల వారిగా చర్చించాల్సిన అంశాల్ని సిద్ధం చేశారు. సభను ఆగస్టు 12 తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. శని, ఆది, ప్రభుత్వ సెలవు దినాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ దృష్ట్యా, మొత్తంగా 22 రోజుల పాటు సభ జరగనుంది. పదో తేదీన నగరాభివృద్ధి, ప్రత్యేక పథకాలపై, 11న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 14న హోం శాఖ, 15న సమాజ సంక్షేమ శాఖ, 16న రోడ్లు, భవనాలు, హార్బర్లు, క్రీడలు యువజన సర్వీసులు, 17న ఉన్నత విద్య, పాఠశాల విద్య, 18న సహకార 21న విద్యుత్, ఎక్సైజ్ శాఖల నిధుల కేటాయింపులపై సమీక్షలు జరగనున్నాయి.
ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. చివరి రోజు పన్నెండో తేదీన ఆర్థిక నివేదికను ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సభకు సమర్పించనున్నారు. అదే రోజు పలు ముసాయిదాల్ని ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు.సీఎం భేటీ : అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాబోతున్న దృష్ట్యా, శాఖల వారీగా జరిగిన కేటాయింపులు, ఆయా శాఖల్లో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి, చేపట్టిన, చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలతో పాటుగా మౌళివాకం ఘటనపై ప్రతి పక్షాలతో ఎదుర్కోవాల్సిన అంశాలపై మంత్రి వర్గంతో సీఎం జయలలిత సమీక్షించారు. ఉదయం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో సీఎం ప్రవేశ పెట్టే ప్రత్యేక ప్రకటనలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.