అధికార అన్నాడీఎంకేకు కొరకరాని కొయ్యగా మారిన టీటీవీ దినకరన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంను మరింత ఇరుకున పడేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో దినకరన్ వలలో చిక్కుకోకుండా ఎడపాడి, పన్నీర్ ఎమ్మెల్యేలకు హితవచనాలు పలికారు. దినకరన్‌కు దూరంగా మెలగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు ఈనెల(జనవరి) 8వ తేదీన ప్రారంభం కానున్నాయి. బొటాబొటీ మెజారిటీ, ప్రతిపక్షాలు సంధించనున్న ప్రశ్నలు, ఎమ్మెల్యేగా దినకరన్ వంటి అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సమావేశానికి సంయుక్తంగా నాయకత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సిన తీరు, ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కోవడం ఎలా తదితర అంశాలపై చర్చించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన దినకరన్ వర్గంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న వారిని స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలుగా పిలుస్తున్నారు.
బుధవారం నాటి సమావేశానికి పలువురు స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతారని ముందుగానే అంచనావేశారు. అంచనాకు తగినట్లుగానే ముగ్గురు మంత్రులు సహా ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని పార్టీ అధికారికంగా ప్రకటించింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు శబరిమలైకి వెళ్లారు. మంత్రులు కడంబూరు రాజా, భాస్కరన్ శివగంగైలో ఒక ప్రయివేటు కార్యక్రమానికి హాజరుకావడంతో గైర్హాజరు అయినట్లు చెబుతున్నారు. అలాగే అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీచేసిన మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. గైర్హాజరైన ఏడుగురు ఎమ్మెల్యేలను మినహాస్తే 104 మంది హాజరుకావాల్సి ఉంది.
దినకరన్‌ను చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదు..
అయితే మొత్తం 95 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకాగా మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేల వరకు ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీకి హాజరైన దినకరన్ చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదని ఆదేశించారు. ఆయనతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించాలని సూచించారు. పన్నీర్, ఎడపాడి ఎమ్మెల్యేలకు ఇంకా అనేక హితవచనాలు పలికారు. పార్టీ, ప్రభుత్వానికి ద్రోహం, కుతంత్రం తలపెట్టే చర్యలకు పాల్పడరాదని, ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని, దినకరన్ గనుక ఏవైనా ప్రశ్నలు సంధిస్తే ఆయా శాఖలకు చెందిన మంత్రులు మాత్రమే సమాధానం చెబుతారని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలి..
మార్చి లేదా ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేకలు, ఆందోళనలకు దిగరాదని, విప్ ఆదేశాలను పాటించాలని కోరారు. పార్టీ మెతకవైఖరే ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పారు. డీఎంకే, టీటీవీ దినకరన్‌లకు ప్రత్యేక ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, అధికారంలో ఉన్న తమకు లేకుంటే ఎలా అని అన్నాడీఎంకే ఆలోచనలో పడింది. ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను ప్రారంభించాలని భావిస్తోంది.
ప్రత్యేకంగా ఒక టీవీ చానల్
అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను తీసుకురావాలనే అంశంపై చర్చించారు. పార్టీ, ప్రభుత్వం గురించి మీడియాతో మాట్లేడేందుకు 12 మంది అధికార ప్రతినిధులను ఈ సమావేశంలో ఎంపిక చేశారు. అధికార ప్రతినిధులు మినహా ఇతరులెవ్వరూ మీడీయాతో మాట్లాడరాదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి దినకరన్ రాక వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ మీడియాతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment