CM edappadi palanisamy
-
దినకరన్‌తో మనకొద్దు..
అధికార అన్నాడీఎంకేకు కొరకరాని కొయ్యగా మారిన టీటీవీ దినకరన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంను మరింత ఇరుకున పడేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో దినకరన్ వలలో చిక్కుకోకుండా ఎడపాడి, పన్నీర్ ఎమ్మెల్యేలకు హితవచనాలు పలికారు. దినకరన్‌కు దూరంగా మెలగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు ఈనెల(జనవరి) 8వ తేదీన ప్రారంభం కానున్నాయి. బొటాబొటీ మెజారిటీ, ప్రతిపక్షాలు సంధించనున్న ప్రశ్నలు, ఎమ్మెల్యేగా దినకరన్ వంటి అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సమావేశానికి సంయుక్తంగా నాయకత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సిన తీరు, ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కోవడం ఎలా తదితర అంశాలపై చర్చించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన దినకరన్ వర్గంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న వారిని స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలుగా పిలుస్తున్నారు. బుధవారం నాటి సమావేశానికి పలువురు స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతారని ముందుగానే అంచనావేశారు. అంచనాకు తగినట్లుగానే ముగ్గురు మంత్రులు సహా ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని పార్టీ అధికారికంగా ప్రకటించింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు శబరిమలైకి వెళ్లారు. మంత్రులు కడంబూరు రాజా, భాస్కరన్ శివగంగైలో ఒక ప్రయివేటు కార్యక్రమానికి హాజరుకావడంతో గైర్హాజరు అయినట్లు చెబుతున్నారు. అలాగే అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీచేసిన మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. గైర్హాజరైన ఏడుగురు ఎమ్మెల్యేలను మినహాస్తే 104 మంది హాజరుకావాల్సి ఉంది. దినకరన్‌ను చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదు.. అయితే మొత్తం 95 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకాగా మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేల వరకు ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీకి హాజరైన దినకరన్ చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదని ఆదేశించారు. ఆయనతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించాలని సూచించారు. పన్నీర్, ఎడపాడి ఎమ్మెల్యేలకు ఇంకా అనేక హితవచనాలు పలికారు. పార్టీ, ప్రభుత్వానికి ద్రోహం, కుతంత్రం తలపెట్టే చర్యలకు పాల్పడరాదని, ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని, దినకరన్ గనుక ఏవైనా ప్రశ్నలు సంధిస్తే ఆయా శాఖలకు చెందిన మంత్రులు మాత్రమే సమాధానం చెబుతారని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలి.. మార్చి లేదా ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేకలు, ఆందోళనలకు దిగరాదని, విప్ ఆదేశాలను పాటించాలని కోరారు. పార్టీ మెతకవైఖరే ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పారు. డీఎంకే, టీటీవీ దినకరన్‌లకు ప్రత్యేక ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, అధికారంలో ఉన్న తమకు లేకుంటే ఎలా అని అన్నాడీఎంకే ఆలోచనలో పడింది. ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రత్యేకంగా ఒక టీవీ చానల్ అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను తీసుకురావాలనే అంశంపై చర్చించారు. పార్టీ, ప్రభుత్వం గురించి మీడియాతో మాట్లేడేందుకు 12 మంది అధికార ప్రతినిధులను ఈ సమావేశంలో ఎంపిక చేశారు. అధికార ప్రతినిధులు మినహా ఇతరులెవ్వరూ మీడీయాతో మాట్లాడరాదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి దినకరన్ రాక వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ మీడియాతో అన్నారు. -
పళనిపై అవిశ్వాసం పెట్టండి
పుదుచ్చేరి/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అన్నాడీఎంకేలోని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి మద్దతు ఉపసంహరించగా ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయిన విషయంపై వీరివురూ చర్చించనున్నారు. ప్రభుత్వం నిలబడాలంటే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆయనవైపు 112 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా పళనిస్వామిని ఆదేశించాలని గవర్నర్‌ను డీఎంకే ఇప్పటికే కోరడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ కూడా పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు విద్యాసాగర్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. పళనిస్వామి మాత్రం విశ్వాస పరీక్ష పెట్టినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదని ధీమాతో ఉన్నారు. ఈ దశలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలసి అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అరియలూరులో జరిగిన ఈ సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ పార్టీని ఎవ్వరూ ధ్వంసం చేయలేని ఓ కోటగా జయలలిత మలిచారని అన్నారు. -
పన్నీరు పావులు
► అమ్మ శిబిరంతో సంప్రదింపులు ► ‘పళని’తో సంధికి యత్నమా.. ► సీనియర్లతో సీఎం మంతనాలు ► రసవత్తరంగా అన్నాడీఎంకే రాజకీయం ► మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బెదిరింపు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవీ శిబిరాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అమ్మ శిబిరం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు, సీఎం ఎడపాడి పళనిస్వామి మధ్య ఇంటి పోరు రచ్చకెక్కిన సమాచారంతో మాజీ సీఎం పన్నీరుసెల్వం పావులు కదిపే పనిలో పడ్డారు. పళనితో సంధికి ప్రయత్నాల్లో పడ్డట్టున్నారు. టీటీవీకి చరమగీతం పాడి సఖ్యతగా అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపిద్దామన్న సంకేతాన్ని సీఎంకు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో సీనియర్లతో సీఎం మంతనాల్లో మునగడం గమనార్హం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో బయలు దేరిన కల్లోలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ రాజీనామా డిమాండ్ అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో వివాదాన్ని రేపింది. రాజీనామా చేయించే ప్రయత్నంలో సీఎం, అడ్డుకునే ప్రయత్నంలో టీటీవీ దినకరన్ ముందుకు సాగుతుండడంతో ఆ ఇద్దరి మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ విభేదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్టట్టున్నారు. చిన్నమ్మ శశికళ, టీటీవీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ శిబిరం, కొత్త ఎత్తులకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. చిన్నమ్మ శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న దృష్ట్యా, ఇక, సీనియర్లను తొక్కి పెట్టి పార్టీలో ప్రస్తుతం పెత్తనం సాగిస్తున్న దినకరన్‌ను ఇదే అదునుగా సాగనంపే వ్యూహాన్ని రచించినట్టు సమాచారం. ఇందుకుగాను, ఎడపాడి పళనిస్వామితో చేతులు కలిపి, దినకరన్‌ను బయటకు పంపించడమే కాకుండా, అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని ఇద్దరం కలిసి కట్టుగా నడిపిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు వ్యూహాలను ఆచరణలో పెట్టే పనిలో పురట్చితలైవీ శిబిరానికి చెందిన నేతలు పాండియరాజన్, సెమ్మలై, జేసీడీ ప్రభాకర్ తమ భుజాన వేసుకుని ఉన్నట్టు తెలిసింది. సీనియర్లతో సీఎం మంతనాలు: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, అదే సమయంలో పార్టీకి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే, సఖ్యతగా ముందుకు సాగుదామన్న సఖ్యత మంత్రాన్ని సీనియర్ మంత్రుల చెవిలో పురట్చి తలైవీ శిబిరం నేతలు వేశారు. సీఎం పళని స్వామి దృష్టికి తీసుకెళ్లి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనను చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయం శుక్రవారం రాత్రి సీఎం ఎడపాడి పళనిస్వామి ఇంట్లో జరిగిన మంతనాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ చేత రాజీనామా చేయించే విషయంగా దినకరన్‌తో భేటీ అనంతరం సీనియర్ మంత్రులు ఎడపాడితోనూ సమావేశం అయ్యారు. విజయభాస్కర్ దగ్గర రాజీనామా చేయించడం లేదా, తొలగించడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎంకు ఆ సీనియర్లు సూచించారు. ఏదేని సమస్య ఎదురైన పక్షంలో ఎదుర్కొందామని, ఢీ కొడదామన్న భరోసాను ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో సీనియర్లు, పన్నీరు శిబిరం నుంచి వచ్చిన సఖ్యత సందేశాన్ని ఉపదేశించారు. దీనిని ఆసక్తిగా విన్న సీఎం, ముందు విజయభాస్కర్ విషయాన్ని తేలుద్దామని, తదుపరి మిగతావి చూసుకుందామన్న వ్యాఖ్యల్ని పలికినట్టుగా పన్నీరు శిబిరానికి సమాచారం చేరి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అమ్మ శిబిరంలో రచ్చకెక్కిన ఇంటి పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే. మరో ఎమ్మెల్యే బెదిరింపు : సీఎం ఎడపాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా బెదిరింపుల స్వరాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా హెచ్చరికలు చేసి ఉండగా, శనివారం మరో ఎమ్మెల్యే ఆ జాబితాలోకి చేరారు. పెరుంతురై ఎమ్మెల్యే, మాజీ మంత్రి తోపు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. అమ్మ పథకాల అమల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే కీలక నిర్ణయాన్ని తాను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. బెదిరింపుల స్వరాన్ని పెంచే ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరం వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంటి పోరు విషయంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో!